కేరళకు చెందిన యూట్యూబ్ ఛానల్ వెనిస్ టీవీ యాజమాని ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈవీఎంలపై నకిలీ వార్తలను ఓ యూట్యూబర్ ప్రచారం చేసినందుకు అతనిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
YouTuber Arrest: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు తప్పుడు సమాచారం ఇస్తుంటారు. ఎలక్షన్ల సమయంలో అసత్య ప్రచారాల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఈసీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. అయితే తాజాగా ఈవీఎంలపై నకిలీ వార్తలను ఓ యూట్యూబర్ ప్రచారం చేశాడు. ఇతనిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన యూట్యూబ్ ఛానల్ వెనిస్ టీవీ యాజమాని ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఈవీఎంలతో మోసాలు జరుగుతాయని, ఈసారి లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని ప్రచారం చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావంతో అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సమాజంలో గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతోనే అతను ఈ వీడియో రూపొందించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై నిఘాను పెంచామని, ఆన్లైన్ కంటెంట్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఈసీ ‘మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను, వెలుగులోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టరు ద్వారా అప్డేట్ చేస్తూ ఓటర్లకు తెలుపుతామని పేర్కొంది.