కన్నడ సీమలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) బీజేపీకి (BJP) ఓటమి భయం పట్టుకుంది. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన తమ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలను ఎలాగైనా ఆకట్టుకునేందుకు బీజేపీ భారీగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో (Narendra Modi) సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీలోని కీలక నాయకులు స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి డీకే అరుణకు (DK Aruna) చోటు లభించడం గమనార్హం.
వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అష్టకష్టాలు పడుతోంది. ప్రధాని మోదీ పాలనను పక్కన పడేసి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తి దృష్టి సారించాడు. అధికారం సాధించడమే లక్ష్యంగా అన్ని అస్త్రాలను మోదీ వినియోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా (Star Campaigners) మొత్తం 40 మందిని నియమించారు. వారిలో ప్రధానితోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా (Amit Shah), రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ధరేంద్ర ప్రదాన్, మన్సూక్ మాండవీయ, భగవంత్ ఖుబా నియమితులు కాగా.. ముఖ్యమంత్రులు బస్వరాజ్ బొమ్మై, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు.
ఇదే జాబితాలో తెలంగాణ నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్థానం దక్కించుకున్నారు. ఇప్పటికే అరుణ కర్ణాటక సహ ఇన్ చార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని (Annamalai) స్టార్ క్యాంపెయినర్ గా ఎంపిక చేశారు. స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపికైన వారంతా కర్ణాటకలో పాగా వేయనున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం జోరు పెంచనున్నారు. కాగా కర్ణాటకలో బీజేపీకి ఈసారి పరాభవం తప్పదని.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు నివేదిస్తున్నాయి.