మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోడీ మాటల్లో దాదాఫాల్కే అవార్డును సాధించుకున్న సుప్రసిద్ధ మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ప్రస్తావన అలవోకగా కాదు, ప్రత్యేకించి, మనఃపూర్వకంగానే వచ్చింది. ప్రధాని స్థాయిలో ఏ ఒక్కమాట కూడా ఉద్దేశ్యపూర్వకంగా తప్పితే యధాలాపంగా వచ్చే అవకాశమే లేదు. నరేంద్రమోడీ కావాలనే ఆయనని తలుచుకున్నారు.
ప్రధానమంత్రి నోటి వెంట ఒక ప్రాంతీయ చిత్రకథానాయకుడి పేరు రావడం మాటలు కాదు. అలా రావడం ఆ కథానాయకుడి స్థాయి, రేంజ్‌ని తెలియజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహించనక్కర్లేదు. ఇటీవల జరిగిన మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోడీ మాటల్లో దాదాఫాల్కే అవార్డును సాధించుకున్న సుప్రసిద్ధ మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ప్రస్తావన అలవోకగా కాదు, ప్రత్యేకించి, మనఃపూర్వకంగానే వచ్చింది. ప్రధాని స్థాయిలో ఏ ఒక్కమాట కూడా ఉద్దేశ్యపూర్వకంగా తప్పితే యధాలాపంగా వచ్చే అవకాశమే లేదు. నరేంద్రమోడీ కావాలనే ఆయనని తలుచుకున్నారు. నిజంగానే ప్రధానులు మారుతారు, దేశాధ్యక్షులు మారిపోతారు. ఆ పదవులు శాశ్వతం కాదు. ఆ స్థానాలూ శాశ్వతం కానే కాదు. కానీ, అక్కినేని నాగేశ్వరరావు లాంటి నటమహోన్నతుడు జీవితకాలపు అంకితభావం, కృషి, దీక్ష ఆయనని దేశచరిత్రలో చిరస్మరణీయుడిని చేశాయి. ఆయన నటించిన పాత్రలు, సాధించిన విజయాలు, నెరపిన జైత్రయాత్రలు బారతీయ చిత్రపరిశ్రమకే తలమానికాలుగా ప్రకాశించాయి.
దేశ సంస్కృతిలో సినిమా అన్నది ప్రధానమైన అంతర్భాగం. కళని, సాహిత్యాన్నీ సమపాళ్ళలో రంగరించి ప్రేక్షకులను ఆహ్లాదపరిచే ఓ గొప్ప వినోదసాధనం సినిమా. అటువంటి సినిమా మాధ్యమం పుట్టిన కొన్నాళ్ళకే చిత్రపరిశ్రమలో ప్రశేవించి, అంచెలంచెలుగా ఎదుగుతూ తన నటనా వైదుష్యంతో సజీవంగా రూపుదిద్దిన చిత్ర మహనీయుడు అక్కినేని. దేవదాసు పాత్రను దేశంలో పోషించని అగ్రస్థాన నటులు లేనేలేరు. కానీ వారిలో కూడా దేవదాసు పాత్ర పోషణలో తనకి తిరుగులేదని నిరూపించుకోవడమే కాదు, అదే పాత్రను హిందీలో పోషించిన దిలీప్ కుమారే స్వయంగా అక్కినేని అభినయానికి ఫిదా అయిపోయారు. అదే మాటను ఆయన బహిరంగంగానే చెప్పారు. అక్కినేనిని మించిన నటుడు లేరని దిలీప్ మనసా మెచ్చికున్నారు. ఇంక తెలుగు చిత్ర సీమ గురించి చెప్పాలంటే అక్కినేని చరిత్రలో తెలుగు సినిమా చరిత్ర కూడా అంతర్భాగమైపోయింది, అదీ అక్కినేని వైశాల్యం. ప్రధాని కూడా రక్తమాంసాలు, రాగద్వేషాలు, ఆత్మీయతలు, ఆరాధనలకు అతీతం కాదు కదా. అందుకే అక్కినేని పేరును కావాలనే గుర్తు చేసుకున్నారు. ఇది నిజంగా గత రెండు రోజులలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కినేని గురించి తెలయిన ఈ తరం అక్కినేని గురించి ఆరా తీసి మరీ, గూగులమ్మ సాయంతో అక్కినేని చరిత్రను మొత్తం చదివేశారు. చదివి కళ్ళు తేలేశారు.
అక్కినేని నిలబెట్టుకున్న డిగ్నిటీ, ఆయన ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయంగా, ఆఛరణయోగ్యంగా మారిపోయాయి. అయితే ఎందరు వచ్చినా, మరెందరు అయనను అనుసరించాలి, అనుకరించాలీ అనుకున్నా కూడా ఎవ్వరూ ఆయన జీవనశైలిని గానీ, ఆయన అభినయ సరళిని గానీ రిపీట్ చెయ్యలేకపోయారు. తొలిచిత్రంలోనే శ్రీరాముడి పాత్రను పోసించిన అక్కినేని ఏడు దశాబ్దాల పాటు పోషించిన పాత్రలు అనన్యసామాన్యమైనవి. ఆయనాచ భారతీయచిత్ర పరివ్రమ చేయిచేయిగా పెనవేసుకుని ఎదిగాయి. అందుకే అక్కినేనిని భారతీయ చిత్రపరిశ్రమనీ విడివిడిగా చేసి చూడలేం.
అయితే, భారతరత్నలు మన తెలుగువారిని ఒక్కరంటే ఒక్కరిని కూడా వరించలేదు. భారతరత్న వరకూ అక్కర్లేదు. పద్మా అవార్డులు కూడా తెలుగువారిని అక్కడక్కడ మొహమాట పడుతూ పలుకరించాయి. అటువంటిది భారతరత్న అంటే పూర్తిగా ఆకాశకుసుమమే అవుతుంది. కానీ, ఇవ్వాలంటే మాత్రం, ఎన్టీఆర్, ఎఎన్నార్‌లను మించినవారు భారతదేశపు ఉపఖండంలోనే లేరు. కానీ మన ప్రభుత్వాలు చాలా బలహీనమైనవి. స్వార్ధరాజకీయాలతోనే దినదినం పబ్బం గడుపుకుంటుంటాయి. ఇలాటి పరిష్థితులలో భారతరత్నలను ఆశించడం దురాశే అవుతుందేమో.
ఎంజిఆర్‌కి వచ్చిన భారతరత్న ఎన్టీఆర్‌కి ఎందుకురాలేదో, ఎఎన్నార్‌కి ఎందుకు రాలేదో దేవుడు కూడా వివరించలేడు. కానీ బిజెపి అగ్రనాయకత్వం ఇటీవలి రోజులలో దేశం మరచిపోయిన కొందరిని భారతరత్నలుగా గుర్తించింది. మరి ఆ పురస్కారం అక్కినేనికి మాత్రం ఎందుకు రాకూడదు? కథానాయకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా అక్కినేని సేవలు మరపురానివి. సినిమా అనే రంగాన్ని సుసంపన్నం చేసి, ఇంత ఎత్తుకు ఎదగడానికి మొత్తం జీవితాన్ని అంకితం చేసిన అక్కినేని కన్నా అర్హులు ఎవరు?
చూద్దాం……ఆశిద్దాం. అదే గనక జరిగిననాడు ఆయనను సుదీర్ఘకాలంగా ఆరాధిస్తున్న అంతులేని అక్కనేని అభిమానులదే ఆ భారతరత్న.