»Telangana Arrangements For Free Travel For Women These Are The Rules
Telangana: మహిళల ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత ప్రయాణం కింద ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడుతుందనే విషయానికి సంబంధించి వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు తెలంగాణలో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఉచిత ప్రయాణం కింద ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడుతుందనే విషయానికి సంబంధించి అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అమలవుతుంది. ఈ పథకం కోసం అక్కడ ఎంత ఖర్చవుతోంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోందనే విషయాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం బెంగళూరుకు వెళ్తుందని సమాచారం. రెండురోజుల పాటు అక్కడ పరిశీలించి నివేదికను సిద్ధం చేయనుంది. వీలైనంత తొందరగా ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదికను అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఈ ఏర్పాట్లు చేస్తోంది.
మొదటిగా ఈ పథకాన్ని తమిళనాడు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. వీళ్లకు ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కర్ణాటకలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ అవకాశం కల్పించారు. కర్ణాటక మోడల్ లేదా తమిళనాడు మోడల్ని తెలంగాణ అనుసరిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచియుండాల్సిందే. ఈ పథకం కింద రూ.2200 కోట్లు వరకు రీయింబర్స్ చేయాలి. లేకపోతే ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నది లెక్క తేల్చుకుని జీరో టికెట్ విధానాన్ని జారీ చేయవచ్చని అంటున్నారు.