జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయనతోపాటు… కాంగ్రెస్ నేతలు సైతం ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాగా.. ఈ రోజు నగరంలో జరుగుతున్న యాత్రలో కాంగ్రెస్ నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావడం విశేషం.
యాత్రలో భాగంగా చార్మినార్(charminar) ను సందర్శించారు రాహుల్ గాంధీ. రాజీవ్ సద్భావన యాత్ర చేసిన చార్మినార్ ను సందర్శించిన ఆయన.. అక్కడే జాతీయ పతాకాన్ని(national flag) ఆవిష్కరించారు. ఈ క్రమంలో చార్మినార్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంతకుముందు మహిళా సంఘాలతో భేటీ అయ్యారు రాహుల్. ఈ సమావేశంలో ట్రాన్స్ జెండర్స్, ఒంటరి మహిళలు, యాసిడ్ బాధితులు ఉన్నారు. దిశా ఘటనతో పాటు మరికొన్ని ఘటనలు, హత్యాచారాలపై మహిళా సంఘాల నేతలు మాట్లాడారు. యాసిడ్ బాధితులను దగ్గరకు తీసుకుని రాహుల్ ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు ఉన్న భద్రత, వారి సమస్యలను గురించి ఆరా తీశారు.