HYD: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఖైత్లాపూర్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా డెడ్ బాడీ ఉండడం గమనార్హం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
HYD: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు స్థానిక ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ తో పాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను కల్పించనున్నారు. ఇతర సందేహాల కొరకు office@des.iith.ac.in మెయిల్ చేయాలన్నారు.
KNR: కొత్త ఆదాయపు పన్ను 2025ను పరిశీలించటానికి లోక్‌సబ స్పీకర్ ఓం బిర్లా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటిలో 31 మంది ఎంపీలను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కి చోటు దక్కింది. దీంతో హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
KMM: మధిరలో దళిత జవాన్ మనోజ్‌పై అగ్రవర్ణుల దాడిని ఖండిస్తూ శనివారం బీఎస్పీ నేతలు చింతకాని పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి నాగేశ్వరరావు స్పందిస్తూ, దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి డిప్యూటీ సీఎం బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
SRD: జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీలో 11వ రోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించారు. శనివారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కార్యాలయం ముందు జేఏసీ రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డంప్ యార్డు వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘం నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
NRPT: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ చిన్నప్పటి నుంచే సేవ గుణం కలిగిన మహానీయుడని, గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చి వారిని చైతన్య పరిచిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారన్నారు.
KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి పాలేరు సరిహద్దుల్లో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీల సాయంతో పైనంపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఇసుకను తరలిస్తున్నారని శనివారం స్థానికులు తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
KMM: గొల్లగట్టు లింగమంతుల జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి 2 రోజుల సెలవు దినాలుగా ప్రకటించాలని అఖిల భారత యాదవ ఖమ్మం జిల్లా ఆధ్యక్షుడు మల్లిబాబు యాదవ్ కోరారు. కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో శనివారం జరిగిన మండల యాదవ సంఘం సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడాతూ.. గొల్లగట్టు లింగమంతుల జాతర అతి పురాతనమైందని, 1,000 సంవత్సరాల చరిత్ర కలిగిందన్నారు.
SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని కరెంట్ సబ్ స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమందికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. బంధువుల దినకర్మకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ADB: ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్మాట్, కడెం ఆయకట్టుల పరిధిలో ఉన్న చివరి పొలాల వరకు సాగునీటిని అందించాలని రైతులు కోరారు. సదర్మాట్ పరిధిలో కడెం, ఖానాపూర్, కడెం ప్రాజెక్టు పరిధిలో దస్తురాబాద్, కడెం, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో ఉన్న రైతులు యాసంగి సీజన్లో వరి, తదితర పంటలు వేశారు. ఆ పంటల పూర్తి వరకు నీటిని అందించాలని రైతులు కోరారు.
NLG: మూడురోజులుగా తెలంగాణా జైళ్ల శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో NLG పోలీసులు గోల్డ్ మెడల్స్ సాధించారు. వాలీబాల్ విభాగంలో వస్కుల శ్రావణ్, కరాటే విభాగాలలో పరాశరన్ బంగారు పథకాలు సాధించడం పట్ల జైలు సూపరింటెండెంట్ ప్రమోద్, జైలు అధికారులు బాలకృష్ణ, నరేశ్ అభినందించారు.
NLG: నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లి శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి 7గంటలకు స్వామి వారి రధోత్సవం నిర్వహించనున్నట్లు దేవాలయ వ్యవస్థాపక ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
KMR: జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ గ్రామానికి చెందిన యువకుడు అమృత్వార్ యోగేశ్ 2, 700 కిలో మీటర్లు బైక్‌పై ప్రయాణించి, ప్రయాగరాజ్, అయోధ్య, వారణాసి పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. బైక్‌పై రాముడి ఆలయానికి వెళ్లడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
SRD: పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి నుంచి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
SRD: మునిపల్లి మండలం చిలపల్లిలో జరిగిన భూ వివాదంలో అన్న తమ్ముడిని చంపాడని ఎస్సై రాజేష్ తెలిపారు. గ్రామానికి చెందిన యాదయ్య తమ్ముడు శివయ్య (37)ను బండరాయితో కొట్టి చంపినట్లు తెలిపారు. శివయ్య తండ్రి పేరున ఉన్న భూమిని తండ్రి చనిపోగానే అన్నయాదయ్య తన పేరుపై చేసుకొని తమ్ముడికి డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. తమ్ముడు పైసలు అడుగుతున్నాడని చంపేశాడన్నారు.