ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.73శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2021 జులై 1 నుంచి డీఏ చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది. ప్రస్తుతం ఒక్క డీఏను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని జనవరి పెన్షన్‌తో కలిపి పెన్షన్ దారులకు ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే, 2021 జులై నుంచి 2022 డిసెంబరు వరకు ఉన్న డీఏ బకాయిలు ఎనిమిది విడుతల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు డీఏ కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వానికి పలుమార్లు వినతులను సమర్పించారు. తాజాగా ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఉత్తర్వుల పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.