తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి… ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. బండి సంజయ్ నేడు పాదయాత్ర చేయాల్సి ఉండగా… చివరి నిమిషంలో పాదయాత్రకు అనుమతి నిరాకరించడం గమనార్హం. శాంతి భద్రతల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాదయాత్రకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. పోలీసుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు హైకోర్డులో బీజేపీ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.
హైకోర్టు నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం బండి సంజయ్ పాదయాత్రపై మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదో విడత పాదయాత్ర ప్రారంభానికి బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యఅతిధిగా రాష్ట్ర బీజేపీ నేతలు పిలిచారు. చివరి నిమిషంలో పోలీసులు పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో.. ఫడ్నవిస్ రాకపై కూడా డైలమా నెలకొంది. హైకోర్టు నుంచి తమకు అనుకూలంగా ఆదేశాలు వస్తాయని, పాదయాత్ర యధావిథిగా కొనసాగుతుందని కాషాయ వర్గాలు ఆశిస్తున్నాయి.
బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు.. లాస్ట్ మినిట్‌లో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించే సమయానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో… పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జరిగిన సీన్ ఇప్పుడు మళ్లి రిపీట్ కావడంతో.. హైకోర్టులో ఈ సారి కూడా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని కమలం వర్గాలు భావిస్తున్నాయి.