Weather dept : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు..3 రోజులు వర్షాలు
గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం (weather station) తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ (Weather Department) వెల్లడించింది.ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడతాయని ప్రకటించిన వాతావరణ శాఖ.. ఎల్లుండి మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వివరించింది. రాగల 3 రోజులు ఉత్తర తెలంగాణ (Telangana) జిల్లాల్లో పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. రాష్ట్రంలోని చాలా చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక సింగరేణి (Singareni) ప్రాంతాల్లో ఎండ 48 డిగ్రీలు దాటింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల వడదెబ్బతో చాలామంది పిట్టల్లా రాలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నారు.