Bandi Sanjay : ముందు మీ అన్నని నిలదీయ్… కవితకు బండి సంజయ్ కౌంటర్..!
ఢిల్లీలో దీక్ష కాదు... ముందు మీ అన్నయ్యను నిలదీయమ్మా అంటూ..కవితను బండి సంజయ్ విమర్శించారు. మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగమన్న ఆయన తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత… దేశరాజధాని ఢిల్లీలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శుక్రవారం (మార్చి 10,2023) భారత జాగృతి నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమె తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేత బండి సంజయ్ కౌంటర్లు వేశారు.
ఢిల్లీలో దీక్ష కాదు… ముందు మీ అన్నయ్యను నిలదీయమ్మా అంటూ..కవితను బండి సంజయ్ విమర్శించారు. మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగమన్న ఆయన తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమని డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెందుకు విప్పడం లేదో ప్రశ్నించమని కోరిన ఆయన మహిళా బిల్లు కాపీలను చించేసిన పార్టీలతో ఎందుకు దోస్తీ చేస్తున్నాడో నిలదీయమని అన్నారు.
మహిళా గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నాడో సమాధానం చెప్పమని ప్రశ్నించారు. మహిళా బిల్లుపై జంతర్ మంతర్ దగ్గర ధర్నా వార్త చూసి జనం నవ్వుకుంటున్నారని, కరెంట్, ఆర్టీసీ, నల్లా, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి ప్రజలను చావబాదుతున్నోళ్లు ధర్నాలు చేయడం సిగ్గు చేటని అన్నారు.
ఎంఐఎం పరాన్న జీవుల పార్టీ… కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశపడే పార్టీ అని ఓవైసీకి దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలని అన్నారు. అలా చేస్తే డిపాజిట్లు రాకుండా చేసి తీరుతామని అన్నారు. ముస్లిం మహిళలంతా బీజేపీవైపే ఉన్నారన్న ఆయన వాళ్లు ఓటేయడంవల్లే ఈశాన్య రాష్ట్రాల్లో గెలిచాం… 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని అన్నారు. సాత్విక్ దోస్తులను బెదిరిస్తే చైతన్య కాలేజీ నిర్వాహకులను గల్లా పట్టి బయటకు గుంజుకొని కొడతామని అన్నారు.