ఇండియన్ రైల్వే (Indian Railways) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే దాదాపు 16 మార్గాల్లో సెమీ హైస్పీడ్ ట్రైన్(Semi High Speed Train)లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా త్వరలోనే మూడోది కూడా రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం(Visakhapatnam), సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్-నాగ్‌పూర్ (Nagpur) మధ్య రైలును తీసుకురావాలని యోచిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ఐదారుగంటల్లోనే ప్రయాణించే అవకాశం లభిస్తుంది. కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు (Bangalore) వంటి పట్టణాలకు వందేభారత్ రైళ్లు (Vande Bharat Trains) నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ విద్యావ్యాపార, ఐటీల ఫార్మా, ఉత్పాదక, రీసెర్చ్, వస్త్ర, వ్యాపారాలు కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. దీంతో దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోందని అధికారులు తెలిపారు.