»14 Bridges On Moosi River Work Started With Rs 545 Crores
KTR: మూసీ నదిపై 14 బ్రిడ్జీలు.. రూ.545 కోట్లతో పనులు ప్రారంభం
మురికి కూపంగా ఉన్న మూసీ నదిని శుద్దీకరించి దానిపై 14 బ్రిడ్జీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మూసీ నది సుందరీకరణకు రూ.545 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మూసీ నది (Musi River)పై 14 బ్రిడ్జీలను రూ.545 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ (Telangana) రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రకటించారు. నేడు ఫతుల్లగూడా-పీర్జాదీగూడ బ్రిడ్జికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు మూసీ నదిని పట్టించుకోలేదన్నారు. ఆ నదిని మురికి కూపంగా మార్చేశాయన్నారు. ప్రస్తుతం మూసీ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని, అక్టోబర్ నెల చివరికి మూసీలో నీటి శుద్దీకరణ పనులు పూర్తవుతాయన్నారు.
మూసీ (Musi), ఈసీ (EC Canal)లపై 14 బ్రిడ్జీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ఉండేలా ఆ బ్రిడ్జీలను (14 bridges) నిర్మించనున్నట్లు వెల్లడించారు. మంచిరేవుల నుంచి ఘట్కేసర్ వరకు మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించనున్నట్లు తెలిపారు. అది సీఎం కేసీఆర్ కల అని, దానిని త్వరలోనే తీరుతుందన్నారు.
మూసీ నది (Musi River)పై ఒక్కొక్కటిగా సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి చేసి బ్రిడ్జీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 160 కిలోమీటర్ల ఓఆర్ఆర్ చుట్టూ తిరగకుండా మధ్యలోనే మూసీ నది మీదుగా వెళ్లేలా బ్రిడ్జీలను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR) వెల్లడించారు. ఆ 14 బ్రిడ్జీలు పూర్తయితే నగరం మరింత సుందరంగా మారుతుందన్నారు.