Congress ఫస్ట్ లిస్ట్ ఇలా.. ఉత్తమ్, మైనంపల్లి ఫ్యామిలీకి 2 టికెట్లు, ఉదయ్ పూర్ డిక్లరేషన్‌కు పాతర
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది. జాబితాలో ఉత్తమ్, మైనంపల్లి ఫ్యామిలీకి చెరో రెండు టికెట్లు లభించాయి. జానారెడ్డి కుమారుడు జయవీర్‌కు నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తారు.
Uttam Couples Get Assembly Ticket: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో బరిలో నిలిచే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ (congress party) విడుదల చేసింది. అమవాస్య పోయిన తర్వాత.. ఈ రోజు 55 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. విజయవాకాశాలు, సామాజిక సమీకరణాలు, సీనియర్లు.. ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని టికెట్ల కేటాయింపు జరిగింది.
మరోసారి తాటిపర్తి
జగిత్యాల (jagtial) నుంచి మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బరిలో ఉంటారు. ఇక్కడ ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. స్థానికంగా బలమైన నేత.. అందుకే జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ధర్మపురిలో మరోసారి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అవకాశం కల్పించారు. మంథని నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బరిలో నిలిచారు. శ్రీధర్ బాబు సీనియర్ నేత.. వివాద రహితుడు, పీసీసీ చీఫ్ స్థాయి వ్యక్తి ఆయన.. మాజీమంత్రిగా పని చేశారు.
పంతం నెగ్గించుకున్న మైనంపల్లి
తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి హన్మంతరావు.. కాంగ్రెస్ పార్టీలో చేరి పంతం నెగ్గించుకున్నారు. ఆయనకు మల్కాజిగిరి, కుమారుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఆందోల్ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహా బరిలోకి దిగుతారు. సంగారెడ్డి నుంచి ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి పోటీలో ఉన్నారు. కుత్భుల్లాపూర్ నుంచి కొలన్ హన్మంత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ అభ్యర్థుల నుంచి పోటీ ఉన్నప్పటికీ.. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ కేటాయించారు.
రేవంత్ ఇక్కడి నుంచే పోటీ
కొడంగల్ నుంచి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారు. ఇది ఆయన కంచుకోట.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. తర్వాత మల్కాజిగిరి నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తారు. సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు జయవీర్ నాగార్జున సాగర్ నుంచి బరిలో ఉంటారు. హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి రెడ్డి దంపతులు బరిలోకి దిగుతారు. నల్గొండ నుంచి సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేస్తారు. ములుగు నుంచి రేవంత్ రెడ్డి అనుచరురాలు సీతక్క.. మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో ఉన్నారు.
ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు పాతర
ఉదయ్ పూర్ కాంగ్రెస్ డిక్లరేషన్ మాట తప్పినట్టు ఉంది. ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఉత్తమ్ ఫ్యామిలీలో ఇద్దరికీ, మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికీ టికెట్లను కేటాయించారు. మరో విడతలో ఎవరికైనా కేటాయిస్తారో చూడాలి.