పంజాబ్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లు ఫిజికల్, టెక్నికల్, మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలని సూచించారు. ‘మనమందరం పొరపాట్లు చేస్తాం. అందులో తప్పులేదు. కానీ మీ గేమ్ ప్లాన్‌కు కట్టుబడి ఉన్నంతకాలం, మీరు ఒక తప్పు చేసినా, నా దృష్టిలో అది తప్పు కాదు. క్రికెట్‌లో ఇవన్నీ సహజం. అది ఆటలో ఒక భాగం’ అని పేర్కొన్నాడు.
భారత క్రికెటర్ రింకూ సింగ్‌కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రాంతీయ క్రీడా అధికారి ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించింది. 2026 T20 ప్రపంచ కప్‌లో ప్రదర్శన, అంతర్జాతీయ పతకాల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూర్యకుమార్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన భారత జట్టులో రింకూ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది. గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు దూరమౌతాడని భావించిన ఆ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులోకి వచ్చాడు. నేడు నేరుగా బెంగళూరుకు చేరుకుని.. జట్టుతో కలవనున్నాడు. అయితే ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. కాగా ఈనెల 28న IPL-19 సీజన్ ప్రారంభం కానుంది.
ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. హార్దిక్ పాండ్యను తప్పించి MIకి సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఆకాంక్షించారు. సూర్య నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. అయితే పాండ్య నాయకత్వ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలులేదన్నారు.
IPL-2026 సీజన్ నేపథ్యంలో RCB బౌలింగ్ విభాగంపై దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో డఫీ, తుషార వంటి నాణ్యమైన బ్యాకప్ బౌలర్లు ఉన్నప్పటికీ.. జోష్ హేజెల్‌వుడ్ లేని RCB పూర్తిగా భిన్నమైన జట్టుగా కనిపిస్తుందని పేర్కొన్నాడు. అతడి అనుభవం, వికెట్లు తీసే సామర్థ్యం జట్టుకు అత్యంత కీలకమని తెలిపాడు. అతడికి ప్రత్యామ్నాయం దొరకడం కష్టమని వ్యాఖ్యానించాడు.
IPL-2026 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆ జట్టు స్టార్ పేసర్ బుమ్రా ఇంకా జట్టుతో కలవకుండా, నేరుగా బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’కు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతను ఏదైనా గాయం కారణంగా అక్కడికి వెళ్ళాడా..? లేదా సాధారణ ఫిట్‌నెస్ పరీక్షల కోసమేనా..? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
LSG ప్లేయర్ అర్జున్ టెండూల్కర్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘లక్నో జట్టులో స్టార్ బౌలర్లు ఉన్నందున అర్జున్‌కు తుది జట్టులో అవకాశం దక్కడం చాలా కష్టం’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కేవలం పేరు ఉంటే సరిపోదని, జట్టు ఎంపికలో ఆటతీరుకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నాడు. అర్జున్ తనను తాను నిరూపించుకోవాలని తెలిపాడు.
T20 WC విజయం తర్వాత భారత క్రికెటర్లు ఆలయాలను సందర్శించడంపై SMలో వస్తున్న విమర్శలపై అక్షర్ పటేల్ స్పందించాడు. మైదానంలో పోరాడి గెలిచినప్పుడు, ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మొక్కులు తీర్చుకోవడంలో తప్పేముందని ప్రశ్నించాడు. ‘విజయం దక్కినప్పుడు గుడికి వెళ్లడం ఒక మంచి పద్ధతి, అది మా వ్యక్తిగత విశ్వాసం’ అని అక్షర్ పేర్కొన్నాడు.
పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. T20 WCలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన ద్వారా అతడు ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈ రేసులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్, అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌ను వెనక్కి నెట్టి ఫర్హాన్ ఈ అవార్డును కైవసం చేసుకోవడం విశేషం.
IPL-2026 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ బ్యాటింగ్ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ సారి ఇన్నింగ్స్‌ను KL రాహుల్ ప్రారంభిస్తాడని ఆ జట్టు హెడ్ కోచ్ హేమంగ్ బదాని స్పష్టం చేశాడు. గత సీజన్‌లో టాప్ ఆర్డర్‌లో చేసిన మార్పుల వల్ల తాము చాలా నష్టపోయామని, మరోసారి ఆ తప్పు చేయమని అన్నాడు. కాగా, రాహుల్‌తో కలిసి అభిషేక్ పోరెల్ లేదా పృథ్వీ షా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
PSLలో పాల్గొనే విదేశీ క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుంటామని పాక్ మిలిటెంట్ గ్రూప్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెదిరింపులను ఏమాత్రం లెక్కచేయకుండా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ పాకిస్థాన్‌కు చేరుకున్నాడు. ఈ సీజన్‌లో స్మిత్ సియాల్‌కోట్ స్టాలియన్స్ జట్టు తరపున బరిలోకి దిగబోతున్నాడు. మార్చి 26 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
IPL-2026 ప్రారంభానికి ముందు SRH ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టమని, అయితే జట్టు ప్రయోజనాల కోసం మేనేజ్‌మెంట్ ఏ స్థానంలో ఆడమన్నా తాను సిద్ధమని ప్రకటించాడు. ఈ సీజన్‌లో నితీష్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈనెల 28న RCBతో SRH తలపడనుంది.
IPL-2026 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ సీజన్‌లో అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. స్టార్క్ IPL ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఇంకా NOC అందలేదని ఢిల్లీ కోచ్ హేమంగ్ బదానీ స్వయంగా వెల్లడించాడు. ఈ జాప్యం కారణంగా స్టార్క్ IPL ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026 ప్రారంభానికి ముందే తీవ్ర భద్రతా ఆందోళనలు నెలకొన్నాయి. పాకిస్తాన్‌కు చెందిన జమాత్-ఉల్-అహ్రార్ అనే మిలిటెంట్ గ్రూప్ విదేశీ ఆటగాళ్లకు బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. PSLలో పాల్గొనేందుకు పాక్‌కు రావద్దని, వస్తే వారి భద్రతకు తాము బాధ్యత వహించబోమని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది. వెంటనే లీగ్ నుంచి తప్పుకోవాలని ఆ గ్రూప్ డిమాండ్ చేసింది.
IPL-2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో ఐదు రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడలేని అభిమానుల కోసం BCCI దేశవ్యాప్తంగా 15 నగరాల్లో ‘ఫ్యాన్ పార్క్’లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇక్కడ భారీ స్క్రీన్లపై లైవ్ మ్యాచ్‌లను వీక్షించడంతో పాటు మ్యూజిక్, ఫుడ్ కోర్టులతో మ్యాచ్‌లను ఎంజాయ్ చేయవచ్చు.