AKP: పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామానికి చెందిన జన సైనికుడు బలిరెడ్డి బాబి రెండు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో పంచకర్ల యువసేన యూత్ సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. బుధవారం రూ.10,000 నగదు, రైస్ బ్యాగ్ అందించారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల యువసేన యూత్ సభ్యులు సతీశ్, వెంకటేశ్, హేమంత్, రవి, ప్రతాప్, మనోహర్ పాల్గొన్నారు.
SKLM: కంచిలి మండలం చిన్న కొజ్జిరియా గ్రామానికి చెందిన గొనప జగ్గు నాయుడు అనే విద్యార్థి ఇటీవల విడుదలైన జెఈఈ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఎంఈవో శివరాం ప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ పరీక్ష లో 97.8 పర్సంటైల్‌తో ఉత్తీర్ణత సాధించారన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం చేపల మార్కెట్ ఏరియాలో ఇటీవల కిన్నెరసాని పైప్ లైన్ వేశారు. ఈ పైప్ లైన్ కోసం తవ్విన గుంటలను మట్టితో పూడ్చారు. అయితే ప్రస్తుతం ఆ పైప్ లైన్ లీకేజీ వల్ల నీరు రోడ్డుపైకి చేరి అసౌకర్యంగా మారుతోందని బుధవారం స్థానికులు చెప్పారు. గుంటలను పూడ్చిన మట్టి లీకైన నీటితో బురదమయంగా మారుతోందని తెలిపారు.
VZM: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాలకు అందిస్తున్న పథకాలు సౌకర్యాలు వివరిస్తూ, నాటుసారా తయారి, వినియోగం వలన కలిగే ప్రభావాలు తెలియజేస్తూ మెంటాడ మండలం కింద గూడెం గ్రామంలో బుధవారం ఆండ్ర ఎస్ఐ సీతారాం ఆద్వర్యంలో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పిల్లల విద్యను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు.
VZM: వేపాడ మండలం ఎన్ కె ఆర్ పురం ఎంపీపీ పాఠశాలలో నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్ ను ఎం ఈ ఓ- 1 ఎన్ కాశీపతిరాజు బుధవారం పరిశీలించారు. కిచెన్ గార్డెన్ లో సాగు చేస్తున్న కాయగూరలను మధ్యాహ్న భోజన పథకంలో సక్రమంగా వినియోగించాలని సూచించారు. అనంతరం ఆయన పాఠశాల పరిసరాలను, వంటగది, తరగతి గదుల నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
NGKL: కల్వకుర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు ఠాకూర్ బాలాజీ సింగ్ కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందివ్వాలని బాలాజీ సింగ్ సీఎంని కోరారు. అనంతరం బాలాజీ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాలాజీ వెంట నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
MDK: ఢిల్లీలో జరిగిన పరిపాలనా సంస్కరణల అంతర్జాతీయ సదస్సుకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌గా మూడు జిల్లాల్లో పనిచేసిన పాలనాపరమైన అనుభవాలను దేశ,విదేశీ ప్రతినిధులతో పంచుకున్నారు. ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, భారత ప్రభుత్వ అధీనంలోని పరిపాలనా సంస్కరణల విభాగం సంయుక్తంగా సదస్సు నిర్వహించారు.
కృష్ణా: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న పురస్కరించుకొని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దామని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం విజయవాడలో ఓ ఫంక్షన్ హాల్లో కూటమి నేతలు అందరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు రాజేంద్రప్రసాద్‌కు వేసేలా పట్టభద్రులను చైతన్యవంతం చేయాలని సూచించారు.
MHBD: రైతుల కండ్లలో ఆనందం చూడడమే, రైతును రాజు చెయ్యడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో ఇటీవల సాగునీటి కొరత సమస్య ఉందని ఎమ్మెల్యే తెలుసుకున్నారు. వెంటనే స్పందించి, బయన్న వాగు రిజర్వాయర్‌ను రైతులతో కలిసి సందర్శించారు. అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
KMM: మిర్చి బస్తాలను దుండగులు చోరీ చేసిన ఘటన తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆటోలో లోడ్ చేసిన మిర్చి బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పంట పెట్టుబడి కోసం రూ. లక్షలు అప్పుగా తీసుకొచ్చి, ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటను దుండగులు చోరీ చేశారని బాధిత రైతు వాపోయాడు.
BDK: ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి నాడు సెలవు ఇవ్వాలని భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారికి TSTTF జిల్లా బృందం బుధవారం వినతిపత్రం అందించారు. అదేవిధంగా కుల గణన సర్వే చేసిన టీచర్లకు రెమ్యూనరేషన్‌తో పాటు ఐదు రోజుల CCL మంజూరు చేయాలని కోరారు. TOSS 2022–24 మధ్య కాలంలో వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ELS మంజూరు చేయాలన్నారు.
కృష్ణా: కోడూరు మండల పరిధిలోని హంసలదీవి సమీపంలో ఉన్న సముద్ర తీరం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం సింధు స్నానాలకు భక్తులు పోటెత్తారు. కృష్ణా జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు చేశారు. సంగమ ప్రాంతంలో స్నానాలు చేసేందుకు అధికారులు అనుమతులు ఇవ్వలేదు. ప్రజలు వేకువజామునే భారీగా వాహనాలపై వచ్చి సముద్ర స్నానాలు చేశారు.
AP: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండే చోట మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే, రూ.90 కోట్లతో బీసీ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
AKP: పాయకరావుపేట పట్టణంలో వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ వచ్చే పోయే వారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. రాత్రి వేళల్లో వీటి అరుపులకు నిద్ర పట్టడం లేదని పట్టణవాసులు తెలిపారు. ద్విచక్ర వాహనదారులను వెంట తరుముతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పంచాయతీ అధికారులు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నాతవరం మండలం లింగంపేట గ్రామంలో బుధవారం జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యుడు దొర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వెన్నెల ఈవెంట్స్, కాంతార డాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.