AKP: పాయకరావుపేట 4వ వార్డు కుమ్మరివీధిలో పొగతో ఈ ప్రాంతీయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొందరు మినీ బట్టీలు ఏర్పాటు చేసి సుచిబుడ్డులు, పూజా ప్రమిదలు, కుండలు తయారు చేస్తుంటారు. అయితే వీటిని వేడి చేసే క్రమంలో పొగ విపరీతంగా వ్యాపించడంతో పొగతో పలు అవస్థలు పడుతున్నామని, దీంతో శ్వాస కోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని స్ధానికులు వాపోతున్నారు.
కృష్ణా: అత్యాచారం కేసులో నిందితుడికి మచిలీపట్నం న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరవల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. 2021లో మల్లవల్లి గ్రామంలో కాసులు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 10 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.
WGL: గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం గణపతి పూజ, పుట్ట మట్టకి వెళ్లడం, మధ్యాహ్నం హోమం కార్యక్రమం, సాయంత్రం వేళలో ఎదుర్కోలు, స్వామివారి కల్యాణం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
WNP: ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు.
NRML: జిల్లాలోని గోదావరి, స్వర్ణ, శుద్ధవాగు పరిసర ప్రాంతాల నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఈ ప్రాంతాలపై నిఘాను పటిష్టం చేసామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లాలో 17 ఇసుక రీచ్‌లు, 35 ఇసుక నిల్వలు ఉన్నాయని తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ ఉంచిన రవాణా చేసిన చర్యలు తప్పవని బుధవారం ప్రకటనలో హెచ్చరించారు.
SRD: మహిళల సంక్షేమం కోసం ఇచ్చిన పూర్తి హామీలు సత్వరమే అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని సంగారెడ్డి జిల్లా BRS నేత చింతల గీతారెడ్డి అన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ 2500, తులం బంగారం, స్కూటీ తదితర హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. మహిళా దినోత్సవంలోపల హామీలు అమలుపై కార్యక్రమం ప్రకటించకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
SRD: చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి అమానుషమని సంగారెడ్డి జిల్లా వైష్ణవ సంఘం అధ్యక్షులు కందాడై వరదాచార్యులు ఖండించారు. ధర్మ పరిరక్షకులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. ధర్మం న్యాయం కోసం పాటుపడే ఇలాంటి అర్చకులపై దాడి చేయడం దారుణమని ఆవేదనతో అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందన్నారు.
AKP: కోటవురట్ల మండలంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. మంగళవారం సాయంత్రం పీఆర్టీయూ ఉపాధ్యాయ ప్రతినిధులు లింగాపురం, తంగేడు,బీకె పల్లి తదితర గ్రామాల్లో ఉపాధ్యాయ ఓటర్లను కలిసి గాదె శ్రీనివాసులు నాయుడికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉపాధ్యాయుల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ప్రచార కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రకాశం: దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో గల మినీ స్టేడియం ప్రాంతాన్ని మంగళవారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేడియం నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కోరమన్నారు. మినీ స్టేడియం త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
CTR: బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విశాఖకు త్వరలో 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు ప్రభుత్వ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహణకు అనువైన ఏర్పాట్లు ఆయా డిపోలో విశాఖ రీజియన్ అధికారులు పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పరిశీలన అనంతరం మొదటి విడతలో 50 బస్సులు, రెండో విడతలో మరో 50 బస్సులు పంపనున్నట్లు తెలిపారు. వచ్చేనెల నుంచి విశాఖకు ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి.
కృష్ణా: మోపిదేవి మండలం కే. కొత్తపాలెం గ్రామంలో ప్రతి రోజు గొడవలు చోటు చేసుకుంటున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలను వాటి యజమానులు రహదారులపై ఉంచుతున్నారని వాపోతున్నరు. దీంతో రోడ్లపై వాహనాలు తిరిగే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల ఇలాంటి ఘటన వల్ల ఓ వ్యక్తి మృతి చెందాడు.
కృష్ణా: టెన్త్ అర్హతతో విజయవాడ డివిజన్‌లో 48 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం.
PLD: వినుకొండలో త్వరలో ఏర్పాటు చేయబోయే లెదర్ పార్క్ స్థల పరిశీలనకు పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు నేడు ఉదయం 10:00 గంటలకు వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు మల్టీ నేషనల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.
కృష్ణా: కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. 5వ టౌన్ పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాకుళానికి చెందిన కోటా కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈనెల 5న కుటుంబ సభ్యులతో కలిసి ట్రైన్‌లో కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ కలిసి రైల్వే స్టేషన్లో భోజనం చేసిన అనంతరం కృష్ణమూర్తి కనపడకపోవడంతో కుమారుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.