ATP: అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ నెల 10న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటకు వస్తుండటంతో ఏర్పాట్లపై చర్చించారు. పార్కింగ్, బహిరంగ సభ వంటి అంశాలు సమీక్షించారు. సభకు 164 మంది ఎమ్మెల్యేలు వస్తారని తెలిపారు.
అన్నమయ్య: సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. శనివారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, అధికారులకు ఫోన్ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
రేపు KMRలో ఉమ్మడి NZB జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఎన్నికల్లో BC డిక్లరేషన్ ప్రకటించిన వేదిక పైనే, అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసుకుని సంబరాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈనెల 15న కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో రేపు సన్నాహక సమావేశం ఉంటుందన్నారు.
WGL: నెక్కొండ మండల కేంద్రంలోని అప్పలరావుపేట రోడ్డులో శనివారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మూల మలుపు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.
VSP: బీచ్ రోడ్ ఏయూ యోగా విభాగంలో ఆదివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు వర్షాకాల వ్యాధులపై ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంచాలకులు ఆచార్య కె.రమేష్ బాబు తెలిపారు. కేజీహెచ్ పూర్వ సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ కె.ఈశ్వర రావు వర్షాకాల వ్యాధులైన చర్మవ్యాధులు, దగ్గు, జలుబు తదితర వ్యాధులకు చికిత్స అందిస్తారు.
SKLM: టెక్కలిలో యూరియా కొరతపై రైతులతో ఈనెల 9న నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని నియోజకవర్గ ఇంఛార్జ్ పేడాడ తిలక్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. శనివారం టెక్కలిలో మాట్లాడుతూ.. సాక్షాత్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి రావడం దారుణమని పేర్కొన్నారు.
SRD: కార్మిక నేత ఎల్లయ్య మృతి కార్మిక లోకానికి, తెలంగాణ సమాజానికి తీరని లోటు అని BHEL ఎల్లయ్య అని ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం కిష్టారెడ్డిపేటలో కార్మిక నేత ఎల్లయ్య భౌతిక దేహానికి ఆయన శనివారం నివాళులర్పించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ మనోధైర్యం కల్పించారు.
ప్రకాశం: జిల్లా అండర్-14 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక ఒంగోలులో ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. ఎంపిక ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, ఆసక్తిగల క్రీడాకారులు తప్పనిసరిగా వైట్ డ్రస్, సొంత కిట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్‌తో హాజరుకావాలన్నారు.
అల్లూరి: అనంతగిరి మండలంలోని పెదబిడ పంచాయతీ పరిధి ధనుకోటలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా పాఠశాల భవనం లేక సుమారు 25 మంది విద్యార్థులకు అంగన్వాడీ భవనంలోనే ఉపాధ్యాయులు బోధనాలు కొనసాగిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
KMM: ఖమ్మం నగరం నలుమూలల నుంచి తరలివచ్చే గణనాథులకు గాంధీచౌక్ లో స్వాగతం పలికే విధంగా స్తంభాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు గాంధీచౌక్ సెంటర్‌లో సార్వజనిక గణేష్ నిమజ్జన వీడ్కోలు బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సెంటర్‌లో లారీ ట్రక్కును వేదికగా మార్చి అలంకరించారు.
SRD: కోహీర్ మండలం పైడి గుమ్మాల్‌లో వినాయకుడి చేతిలోని లడ్డు వేలంపాటలో శనివారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన ముస్లిం వ్యక్తి సొంతం చేసుకున్నారు. స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు అర్ధరాత్రి నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన లడ్డూ వేలంపాటలో రూ.1.56లక్ష మహాబూబ్ అలీ అనే వ్యక్తి లడ్డును దక్కించుకున్నారు.
TG: హైదరాబాద్‌లో అన్ని దారులు హుస్సేన్ సాగర్ వైపే కదులుతున్నాయి. నగరంలో వైభవంగా నిమజ్జోనత్సవ వేడుక సాగుతోంది. గణనాథులు భారీ సంఖ్యలో సాగర్ వైపు వస్తున్నారు. నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ వద్ద సందడి నెలకొంది. గణపతి నామస్మరణలతో ప్రధాన రోడ్లన్నీ మార్మోగుతున్నాయి. మరోవైపు బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర ముందుకు సాగుతోంది.
GNTR: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ దిగుమతులపై 50 శాతం పన్నులు పెంచడంపై వామపక్ష నేతలు మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. సీపీఐ నేతలు మాల్యాద్రి, తిరుపతయ్య మాట్లాడుతూ.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రంలోని ఆక్వా రంగానికి దెబ్బ అని మండిపడ్డారు.
E.G: కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనాలు సాఫీగా కొనసాగేందుకు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీఐ పీ.విశ్వం తెలిపారు. గోష్పాద క్షేత్రంలో ప్రత్యేక క్రేన్, అగ్నిమాపక శకటాన్ని అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటి వరకు 115 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు, ఈరోజు ముగింపు రోజు కావడంతో 50 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని ఆదివారం మూసివేయనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రేపు ఉదయం 11:00 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత తిరిగి ఆలయం తెరుచుకుంటుందని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాగలరని ఆమె కోరారు.