ASR: మన్యం జిల్లా మక్కువ మండల విలేకరిపై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఏపీటీఆర్ఏ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు శెట్టి మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను బయట పెట్టిన జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదని తీవ్రంగా ఖండించారు. తక్షణమే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ADB: వారం రోజుల కిందట ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగిన ఘటన మరువకముందే నార్నూర్‌లో మరో చోరీ జరిగింది. శ్రీనివాస వైన్ షాపులో సోమవారం రాత్రి దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు. దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకున్న యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
SKLM: రణస్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లావేరుకు చెందిన ఓ పాప బ్రెయిన్ సర్జరీ నిమిత్తం రూ.1,57,000 చెక్కును అందజేయడం జరిగిందన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఈ సహాయం అందించిందన్నారు.
కృష్ణా: బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రాష్ట్ర వాటా కింద కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి 3.25 లక్షల మంది విద్యార్థులను జగన్ దగా చేశాడని టీడీపీ నేత బెజవాడ నజీర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వేతనాల బకాయిలు మొత్తం రూ.254.48 కోట్లు విడుదల చేసేందుకు కూటమి నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
TG: కులగణన సర్వేలో అంతా భాగస్వామ్యం కావాలాని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కొందరు కావాలనే సర్వేలో పాల్గొనడం లేదన్నారు. ‘ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌లు పెట్టడం కాదు.. సర్వేలో పాల్గొనాలని తన కుటుంబానికి చెప్పాలి. బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదు. బీసీలపై బీజేపీ కపట ప్రేమ చూపిస్తోంది. రాహుల్ గాంధీ కులం తెలుసుకోవాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి’ అని పేర్కొన్నారు.
W.G: తణుకు పట్టణానికి చెందిన రూట్స్ స్కూలు ప్రిన్సిపాల్ ఎల్‌కే త్రిపాఠికి గురుబ్రహ్మ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందజేశారు. సోమవారం హైదరాబాదు లలితకళాతోరణం ఆడిటోరియంలో నిర్వహించిన సీవీ రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రముఖ నటుడు రావురమేష్ చేతుల మీదుగా త్రిపాఠి అవార్డు అందుకున్నారు.
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ వల్లభనేని వంశీని కలవనున్నారు. విజయవాడ సబ్ జైలులో ములాఖత్ కానున్నారు. ఈ క్రమంలో అక్కడకు భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కారాగారం పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్‌లో ఉన్నారు.
గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి పై శిక్షణ తరగతులను మండల విద్యాశాఖ అధికారులు విమలమ్మ, సాయి చక్రధర్ నిర్వహించారు. రిసోర్స్ పర్సన్స్‌గా మీసాల శివాజీ, మంత్రి అప్పలనాయుడులు వ్యవహరించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్లు రమాకుమారి, శ్యామల హైమావతిలు డీఆర్పిలుగా వ్యవహరించారు.
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని స్కూల్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఇంగ్లీష్ విద్యా బోధన విధానంపై సమావేశం నిర్వహించారు. మండల విద్యాధికారి నాగారం శ్రీనివాస్ ఇంగ్లీష్ విద్యా బోధనలో మెళుకువలపై ఇంగ్లీష్ బోధకులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. విద్యార్థుల అభ్యాసనలో ఇంగ్లీష్ బోధన సామర్ధ్యాలు మెరుగుపరిచి, పటిష్టం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో SA టీచర్లు ఉన్నారు.
NLG: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సూర్యపేటలోని లింగమతుల స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తమ మొక్కులు చెల్లించుకొని స్వామి కృపకు పాత్రులవుతున్నారు. భారీగా వాహనాలు తరలివస్తుండటంతో అధికారులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. HYD నుంచి VJWD వెళ్లే వాహనాలను NKP వద్ద దారి మళ్లిస్తున్నారు.
VZM: ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎల్కోట ఆమె క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ మేరకు వేపాడ మండలం కరకవలసకు చెందిన పాము రోహిత్ కుమార్‌కు మంజూరైన రూ.1,16,040 చెక్కును లబ్ధిదారుడకు అందజేశారు. సీఎం సహాయనిధి పేద ప్రజలకు ఆపన్నహస్తమని కొనియాడారు. గత ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర సోమవారం రూ.13,800 పలకగా.. నేడు రూ. 13,600 పలికింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.16 వేలు ధర రాగా.. ఈరోజు రూ. 16,200 కి పెరిగింది. మరోవైపు 341 మిర్చికి నిన్న రూ.13,500 ధర రాగా ..నేడు రూ .13,400 తగ్గింది.
ATP: అనంతపురం త్రీటౌన్ పోలీసులు భూ కబ్జాదారులపై కొరడా ఝులిపించారు. CI శాంతిలాల్ వివరాల మేరకు.. విద్యారణ్య నగర్‌లో విజయకృష్ణకు చెందిన భూమిని కొంత మంది వ్యక్తులు ప్రజా సంఘం ముసుగులో ఆక్రమించారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై భూకబ్జా కేసులు నమోదు చేశామన్నారు. భూకబ్జాలపై ఏమాత్రం సహించమని అవసరమైతే PD యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.
KMR: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం రెండో రోజు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు అద్దాలు వాడాలని సూచిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్లు రవీందర్, లింబాద్రీ ఉన్నారు.
KDP: రాజుపాలెం మండలంలో మిస్సింగ్ కేసు నమోదైంది. కొర్రపాడు గ్రామానికి చెందిన దద్దనాల జమీల అనే మహిళ, ఆమె పిల్లలు కమాల్ బాషా (8), మదియా (6) ఆదివారం నుంచి కనపడకుండా పోయారని రాజుపాలెం ఎస్ఐ కత్తి వెంకట రమణ తెలిపారు. ఈ విషయమై రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు 91211 00600 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.