VZM: గజపతినగరం నియోజకవర్గంలో బుధవారం కార్మికులు నిరసన చేపట్టారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ అంగన్వాడీలు, పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు నల్ల రిబ్బన్లతో విధులు నిర్వహించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మారుస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి విమర్శించారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శుక్రవారం గుడ్ ఫ్రై డే, శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకుని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
PPM: వాణిజ్య సముదాయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని పార్వతీపురం మున్సిపల్ ప్రత్యేక అధికారి, కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి వ్యాపారులకు సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ముస్తాబు’ కార్యక్రమంలో భాగంగా కొనుగోలుదారులకు ఇబ్బందు లేకుండా చూడాలన్నారు.
SDPT: సిద్దిపేట రూరల్ మండలం చింతమడక శ్రీపట్టాభి రామాలయంలో ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రాంతం స్వామివారి కృపతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. లోకకల్యాణం కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
RR: రేపటి భవిష్యత్తు తరాల కోసం ఎన్ని నిధులైన ఖర్చు పెట్టడానికి వెనుకంజ వేసే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న హై స్కూల్ నిర్మాణ భవనం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ నేపథ్యంలో తాపీ తీసుకుని ఇటుకలను పేర్చి చదును చేసిన తీరును చూసి అక్కడున్న వారందరూ మంత్రముగ్ధులయ్యారు.
విశాఖలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ సహా పలువురు వైసీపీ కీలక నేతలు ద్రోణంరాజు శ్రీవత్సవ నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్పాహార కార్యక్రమంలో పాల్గొని పాత అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం శ్రీవత్సవ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, 2029లో జగన్‌ను మళ్లీ సీఎంగా తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.
PPM: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి యువతకు పిలుపు ఇచ్చారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడేవారు ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది సులభంగా అధిక నగదు సంపాదించవచ్చని ప్రలోభాలు పెడతారని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఇచ్ఛాపురంలో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని తహసీల్దార్‌కు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా బుధవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో గ్యాస్ సరఫరా పక్కదారి పడుతుందని శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయని తెలిపారు.
MNCL: మందమర్రి ఏరియా గనులు ఈ ఆర్థిక సంవత్సరంలో 71 శాతం ఉత్పత్తి సాధించాయని ఏరియా GM ఎన్. రాధాకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేకే- 5 భూగర్భ గని ఏకంగా 110% ఉత్పత్తి సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. వచ్చే ఏడాది 100% లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
ప్రకాశం: దొనకొండ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి దొనకొండకు బదిలీ అయ్యారు. గతంలో దొనకొండ ఎస్సైగా పనిచేసిన త్యాగరాజును ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
MDK: కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ అమలును నిరసిస్తూ తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ఇవాళ ప్లకార్ట్స్‌తో సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు బాబు డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు-2022ను వెనక్కి తీసుకోవాలని కోరారు.
AKP: జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడును నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు బుధవారం కలిశారు. పదో తరగతి మూల్యాంకన విధుల్లో 60 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు, అనారోగ్య కారణాలచే అభ్యర్థించుకున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని, మూల్యాంకన రుసుమును జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలన్నారు.
JGL: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లోని పెద్ద వాగుని బుధవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. వాగు నుంచి జరుగుతున్న ఇసుక రవాణా గురించి పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం రెబ్బెన మండలంలోని రాంపూర్ గ్రామం దగ్గర ఎలాంటి అనుమతి పత్రాలు, ట్రాక్టర్ డాక్యుమెంట్ల లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను కలెక్టర్ హరిత సీజ్ చేశారు.
KNR: గంగాధర మండలం కురిక్యాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ నూతన వస్త్రాలు అందజేశారు.