KKD: విజయవాడ రైల్వే స్టేషన్‌లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తునికి చెందిన దేవవరపు చండీ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను విజయవాడలో ఇప్పటి వరకు 3 చోరీలు చేశాడని వెల్లడించారు. నిందితుడిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే సీఐ తెలిపారు. అతని నుంచి రూ.4,73,000ల చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ పరిధిలో ఉన్న రైతులు పంటలను పరిశీలించి సలహాలు తీసుకోవాలని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 2 రోజులుగా మండలంలో అకాల వర్షాలు పడుతున్నాయని తెలిపారు. అకాల వర్షాలకు పంటలకు వివిధ తెగుళ్లు సోకే ప్రమాదం ఉందన్నారు. రైతులు వేసిన పంటలను క్షుణ్ణంగా పరిశీలించి తెగుళ్లు సోకితే నివారణకు సలహాలు తీసుకోవాలన్నారు.
BDK: సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశంలో సీపీఐ మేయర్ మూడ్ గణేష్‌ని మంగళవారం కౌన్సిల్ సభ్యులు సన్మానించారు. తనకు గుర్తింపునిచ్చిన పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
NRML: రాంటేక్‌లో అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దుబాయ్‌లో ఉంటున్న భర్త పోశెట్టి నిరంతరం ఫోన్‌లో వేధిస్తూ, అనుమానించడంతో మనస్తాపానికి గురైన రజిత (26) మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పది రోజులుగా వేధింపులు మితిమీరడంతో పాటు, చనిపోవాలంటూ భర్త ప్రేరేపించడమే ఈ దారుణానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనాలో తేలింది. తన 3 పిల్లలు ఆనాధలయ్యారు.
KRNL: అనంతపురం గిరిజన సంక్షేమ శాఖ అధికారి జి.నాగభూషణంకు లంచం కేసులో జిల్లా ఏసీబీ కోర్టు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. బాధితుడికి రూ.1.90 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2018లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్‌స్పెంటివ్ బిల్లు మంజూరు కోసం రూ.4 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
ELR: జిల్లాను మాదకద్రవ్య రహితంగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలతో యువత భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
KDP: బద్వేల్ పురపాలక సంఘంలో ఆస్తి పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. ఒకే రోజు రూ.46.50 లక్షలు వసూలైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఫీల్డ్ సిబ్బంది వసూళ్లు కొనసాగుతుండడంతో మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.8.30 కోట్లకు పైగా పన్నులు వసూలైనట్లు వెల్లడించారు.
కోనసీమ: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు “స్టాప్, వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం ముమ్మరంగా నిర్వహిస్తోంది. పోలీసులు అమలాపురంలో మంగళవారం అర్ధరాత్రి, తెల్లవారుజామున డ్రైవర్లను గుర్తించి, నీళ్లతో ముఖం కడిగించి, వారు పూర్తిగా అప్రమత్తమైన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
WNP: గోపాల్‌పేట మండలంలోని పెద్దబండ తాండలో తుల్జా భవాని పూజను బంజారా సంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించారు. తండావాసులు సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేస్తూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.
HNK: ఉమ్మడి జిల్లాలో యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం అమలులో ఆలస్యం జరుగుతోందని యువకులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం ప్రకటించిన ఈ పథకానికి SC, ST, BC మైనార్టీ వర్గాలకు చెందిన 1,22,636 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి మోక్షం కలగలేదని అన్నారు. ప్రభుత్వ స్పందించి ఆర్థిక భరోసా అందించాలని కోరారు.
ADB: నార్నూర్ మండలంలోని గుండాల గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ జాడి రాజలింగు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్థులకు రాజ్యాంగ హక్కులు, పౌర బాధ్యతలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
KMM: ఆడశిశు గర్భస్రావాలు, గర్భపాతాలు, లింగనిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలపై కఠిన నిఘా అవసరమని DMHO డా.రామారావు తెలిపారు. జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గకుండ ఉండటం కోసం PCPNDT చట్టం-1994ను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులు, సంస్థలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని హెచ్చరించారు.
SS: రొద్దం మండలంలో నూతనంగా నిర్మించిన రహదారిని మంత్రి సవిత బుధవారం పరిశీలించారు. పావగడ ప్రధాన రహదారి నుంచి దొడగట్ట గ్రామం వరకు రూ.10.25 కోట్ల నిధులతో ఈ రోడ్డు పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రహదారి నాణ్యతను అధికారులతో కలిసి ఆమె స్వయంగా తనిఖీ చేశారు. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
RR: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు ఇవాళ మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మలకు మూడు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు పోలీసులు వారిని విచారించనున్నారు. కాగా, చంచల్ గూడ జైలులో నిందితులను మరికాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు.
WGL: న్యూశాయంపేటలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ‘వన మయూరి’ సంచార జంతు ప్రదర్శన వాహనం గత 15 ఏళ్లుగా ఉపయోగం లేక మూలన పడి ఉందని ప్రజలు ఆరోపించారు. పర్యావరణం, జంతు సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ వాహనం పాడై నిరుపయోగంగా మారిందని వాపోయారు. అధికారులు స్పందించి వాహనాన్ని మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు.