NZB: సిరికొండ మండలం రామడుగులో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం కోసం శుక్రవారం విరాళాలు సేకరించారు. కమిటీ ఛైర్మన్ పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ ఛైర్మన్ గోపాల్ రూ. 20 వేలు, సర్పంచ్ వరలక్ష్మి రూ. 15 వేలు, రాజకిషన్, గంగాధర్ రూ. 11 వేల చొప్పున అందజేశారు.
PLD: మాచర్ల మండలం రేగులవరం తండాలో కొలువుదీరిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ సేవాలాల్ స్వామి వార్ల ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా జీవ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ క్రతువును స్వయంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆపడానికి ఇకపై స్క్రీన్‌పై వేలితో నొక్కి పట్టుకోవాల్సిన(Long Press) అవసరం లేదు. యూట్యూబ్ తరహాలో ‘ట్యాప్-టు-పాజ్’ ఫీచర్‌ను మెటా పరిచయం చేస్తోంది. ఒక్క ట్యాప్‌తో వీడియోను ఆపి, క్యాప్షన్లను ప్రశాంతంగా చదువుకోవచ్చు. పాజ్ చేసినప్పుడు మ్యూట్ ఆప్షన్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ అప్‌డేట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో బీజేపీ పదాధికారుల జిల్లా సదస్సు శుక్రవారం ఉదయం గమినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సభలో జిల్లా ముఖ్య ప్రముఖులు నరిశే సోమేశ్వర రావు మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యకరమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, ఆర్సెస్ నాయకులు పాల్గొన్నారు.
SKLM: శాలిహుండం గ్రామానికి చెందిన చింతల మోహన కృష్ణ నవోదయ ప్రవేశ పరీక్షల్లో 87.5 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. శాంతినికేతన్ స్కూల్‌లో చదువుతున్న మోహనకృష్ణ ఎచ్చెర్ల మండలం కేశవరావు పేట గ్రామంలో శిక్షణ తీసుకుని విజయం సాధించాడు. తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, తదితరులు అభినందనలు తెలిపారు.
CTR: టమాటాలతో వెళ్తున్న ట్రక్కు సోమల-చౌడేపల్లి మార్గంలో బోల్తా పడింది. మలుపులో హఠాత్తుగా కారు రావడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగినట్టు డ్రైవర్ తెలిపాడు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. 100 బాక్సుల టమాటా నేలపాలు అయింది. ట్రక్కు డ్రైవర్ వెంటనే స్థానికుల సాయంతో టమాటాలను సేకరించి మరో వాహనంలో పంపించారు. ప్రమాద ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు.
మంచిర్యాల: వేంపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడ్డెర కాలనీకి చెందిన పల్లపు ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వెంటనే చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి, బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరించారు.
WNP: రైతు నేస్తం ఫౌండేషన్ ప్రతి ఏటా అందించే శ్రీ తుమ్మేటి రాఘోత్తమ రెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారం-2025కు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పోల్కంపల్లి సుజాత ఎంపిక అయింది. తన ఇంటి టెర్రస్‌పై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను గత 5సం.లుగా సాగు చేస్తున్నందున ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం ఏపీలోని గుంటూరులో ఈఅవార్డును అందజేయనున్నారు
KRNL: చిప్పగిరి మండలం కుందనగుర్తిలో డాక్టర్ అప్రోజ్ ఆధ్వర్యంలో ఇవాళ చంద్రన్న సంచార వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ తదితర సాధారణ ఆరోగ్య పరిక్షలు చేశారు. అవసరమైన వారికి తగిన మందులు ఉచితంగా అందజేశారు. శిబిరం సాయంత్రం వరకు కొనసాగుతుందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సూచించారు.
KMR: జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మాజీ కౌన్సిలర్ జూలూరి సుధాకర్ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. పార్టీలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన షబ్బీర్ అలీ, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, మహేష్ కుమార్ గౌడ్‌కు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. తన్నీరు శ్రీనివాసరావు శుక్రవారం ఫిరంగిపురం మండలంలో పర్యటించారు. పొనుగుపాడు గ్రామంలో పశువుల గాలికుంటు వ్యాధి నిర్ధారణ కోసం రక్త నమూనాలను సేకరించే ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి డా. షేక్ పీర్ అహ్మద్ పాల్గొన్నారు.
NLG: ఎండలు తీవ్ర రూపం దాల్చకముందే చిట్యాల మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా 8,9 వార్డుల్లో ఇళ్లలోకి సరిగా నీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆయా వార్డు కౌన్సిలర్లు కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్ వెంటనే స్పందించి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అధికారులు పరిస్థితిని గుర్తించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ASF: సింగరేణి పరిరక్షణ కోసం శనివారం నిర్వహించనున్న ‘సేవ్ సింగరేణి’ జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని AITUC గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి పిలుపునిచ్చారు. రెబ్బెన మండలం గోలేటిలో శుక్రవారం మాట్లాడారు. ఈ జాతా గోలేటిలో ప్రారంభమై కొత్తగూడెంలో ముగుస్తుందని తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు.
NLR: మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డీఓ బి.పావని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఆత్మకూరు ఆర్డీవో బి.పావనిని ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నియమించారు. దీంతో ఇవాళ బి.పావని బాధ్యతలు స్వీకరించారు.
MDK : చిలిపిచేడ్ మండల కేంద్రంలో గాలికుంటు వ్యాధి నివారణకు పశువులకు టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఎల్ఎస్ఏ డాక్టర్ గట్టయ్య బృందం పశువులకు టీకాలు వేసింది. సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ శ్రీరాములు పాల్గొని పాడి రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు.