హైదరాబాద్ లో మెట్రో సిబ్బంది ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. నేడు కూడా మెట్రో సిబ్బంది విధులకు గైర్హజరై… ఆందోళన కొనసాగిస్తున్నారు. నాగోల్ మెట్రో కార్యాలయం వద్ద వీరి ధర్నా కొనసాగుతోంది.
ఐదేళ్లుగా తమకు వేతనాలు పెంచలేదని టికెటింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా 11 వేలు జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు. ఈక్రమంలోనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ టికెంటింగ్ సిబ్బంది విధులను బహిష్కరించింది. మంగళవారం ఉదయం నగరంలోని మెట్రో టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనకు దిగారు.
ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్ లోని 27 స్టేషన్లలోనూ ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదన్నారు. వేతనాలు పెంచే వరకు విధులకు హాజరు కాబోమని తేల్చిచెప్పారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. చర్చలు సాగాయి. అయితే.. ఈ ధర్నాపై మెట్రో సంస్థ యాజమాన్యం సీరియస్ అయినట్లు ప్రచారం సాగుతోంది.
కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని.. మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం ధర్నాకు దిగారని మెట్రో సంస్థ సీరియస్ గా ఉందని అంటున్నారు.అయితే సమయం ప్రకారమే మెట్రో రైళ్లు నడుస్తున్నాయని మెట్రో సంస్థ పేర్కొంది.