తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పథకం రైతు బంధు. సీజన్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. దీంతో చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుంది. మరీ వందలాది ఎకరాల భూమి ఉన్న ఆసాముల ఖాతాల్లో లక్షల రూపాయల నగదు జమవుతోంది. అందుకే ఈ పథకంపై కొందరి నుంచి వ్యతిరేకత వస్తోంది. పథకం వద్దు అనేవారు చాలా మంది ఉన్నారు. అయితే రైతుబంధు పథకం ఇచ్చేందుకు భూమికి పరిమితులు విధించాలని కూడా మరికొందరు చెబుతున్నారు. ఐదెకరాలు, ఆ లోపు ఉన్నవారికి రైతుబంధు వేస్తే ఇబ్బందులు ఉండవని అంటున్నారు. లేదంటే ప్రజాధనం వృథా అవుతుందని.. ఆ నగదును ఇతర పథకాలకు యూజ్ చేయచ్చు కదా అనేవారు చాలామందే ఉన్నారు.
ఓ వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) కూడా ఇబ్బంది పడ్డారు. ఇక లాభం లేదని అనుకున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. నల్గొండ జిల్లా కట్టంగూరు ఏఈవో పరశురాములు లేఖాస్త్రం సంధించారు. పథకాన్ని ఐదెకరాలకే పరిమితం చేయాలని అందులో కోరారు. లేదంటే ధనికులు, రియల్ ఎస్టేట్, బీడు భూములకు కూడా రైతుబంధు వస్తోందని వివరించారు. దీంతో నిధులు వృథా అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పథకం నిలిపివేస్తే.. మిగిలిన నగదుతో రైతులు పొలాలకు వెళ్లేదారులను బాగు చేయొచ్చని సలహా కూడా ఇచ్చారు. తాను ఈ విషయంపై చాలా మదన పడ్డానని పేర్కొన్నారు. చివరికీ సీఎంకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకొని, ముందడుగు వేశానని తెలిపారు.
పరశురాములు అభిప్రాయంతో ఏకీభవించే వారు చాలా మందే ఉన్నారు. రైతు బంధు పథకం ద్వారా భూస్వాములకే మేలు జరుగుతుందని అంటున్నారు. పథకం ప్రవేశపెట్టిన తొలినాళ్లలో రాజకీయ ప్రముఖులు రైతుబంధును వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత దాని ఊసే లేదు. ప్రభుత్వం మాత్రం పంట పంటకు వేల కోట్ల నిధులను మంజూరు చేస్తోంది. ఇదీ ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయినప్పటికీ పథకం మాత్రం భూ స్వాములకు కూడా వర్తిస్తోంది. సీఎం కేసీఆర్ మాత్రం.. భూ స్వాములు చాలా తక్కువని.. 5 శాతం మందే ఉంటారని కవరింగ్ చేశారు. అందరికీ పథకం వర్తింపజేస్తున్నారు. అంత ఎందుకు సినీ నటుడు నాగార్జునకు కూడా రైతు బంధు వచ్చిందని ఇటీవల వార్తల్లో చూశాం. వేల కోట్ల ఆస్తులు ఉన్నవారికి కూడా పథకం వర్తింపజేయడం మంచిది కాదు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది.
రైతుబంధు వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. మిగుల బడ్జెట్ గల రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాల వల్ల అప్పుల కుప్పగా మారింది. దళితబంధును తెరపైకి తీసుకొచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నారు. అయితే గైడ్ లైన్స్ సరిగా లేవు. ప్రభుత్వ ఉద్యోగికి కూడా దళితబంధు ఇస్తామని చెప్పడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. హుజురాబాద్ బై పోల్ సమయంలో అక్కడ ఉన్న అందరూ ఎస్సీలకు దళితబంధు వచ్చింది. కొన్ని చోట్ల కూడా వంద శాతం మందికి దళితబంధు పథకం వచ్చింది. కానీ ఆ పథకం ద్వారా ఇచ్చే నగదు రూ.5 లక్షలు లేదంటే 2,3 లక్షల వరకు ఇస్తే.. అందరికీ మేలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో ఇవ్వడం వల్ల, కొందరు పార్టీ కార్యకర్తలకు రావడం వల్ల.. నిజమైన అర్హులకు పథకం రావడం లేదు.