ప్రభుత్వ పథకాలకు (Govt Schemes) బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్లు అని ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న సైనికులు వాలంటీర్లు (Volunteers) అని కొనియాడారు. వారి కృషి వలనే ప్రజలకు సంక్షేమ పథకాలు సవ్యంగా దక్కుతున్నాయని చెప్పారు. 2.66 లక్షల మంది ఈ యజ్ణంలో పాలుపంచుకుంటున్నారని వెల్లడించారు. విజయవాడలో (Vijayawada) శుక్రవారం ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం నిర్వహించారు.
ఉత్తమ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు వాలంటీర్లకు ప్రదానం చేశారు. అంతకుముందు సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు దక్కుతున్నాయి. 25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు. డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం. నాన్ డీబీటీ కలిపితే మొత్తం రూ.3 లక్షల కోట్లు అందించాం. ప్రభుత్వంపై నిందలు వేస్తే నిజాలు చెప్పగలిగిన సత్య సారథులు వాలంటీర్లు’ అని తెలిపారు.
ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు సీఎం జగన్. మంచి చేశాం కాబట్టే గడపగడపకు వెళ్తున్నామని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు (Nara Chandrababu Naidu) కడుపు మంట అని విమర్శించారు. గతంలో జన్మభూమి కమిటీల (Janmabhumi Committee) అరాచకాలతో ప్రజలు నష్టపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు, ఇతర మంత్రులు ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,33,719 మంది వాలంటీర్లకు రూ.243.34 కోట్ల నగదు పురస్కారాలు అందించారు.