విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదాంకితుడు నందమూరి తారక రామారావు (NT Rama Rao) విగ్రహం ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. ఖమ్మంలోని లకారం చెరువు (Lakaram Lake) మధ్యలో విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. శ్రీకృష్ణుడి (Sri Krishna) ఆకారంలో ఉన్న విగ్రహం వద్దని యాదవ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. వారి వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం విగ్రహం వేరేది ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలతో నిర్వాహకులు ఖంగు తిన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు మొదలుపెట్టారు. అయితే అదే విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఖమ్మం (Khammam)లోని లకారం చెరువు మధ్యలో తీగల వంతెనకు (Cable Bridge) ప్రత్యేక ఆకర్షణగా.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని వివిధ సంఘాలు నిర్ణయించాయి. మంత్రి అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించవద్దని సినీ నటి, యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలు కరాటే కల్యాణి (Karate Kalyani) అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో పై ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలతో నిర్వాహకులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించారు.
విగ్రహం కిరీటంలోని నెమలి పింఛం, వెనుక భాగాన విష్ణుచక్రం, పిల్లన గ్రోవి తొలగిస్తామని నిర్వాహకులు తెలిపారు. మిగతా విగ్రహం యథావిధిగా ఉంచి ఈనెల 28న ఆవిష్కరిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. మరి వీరి నిర్ణయానికి హైకోర్టు, యాదవ సంఘాలు (Yadav Organisations) ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. కాగా ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో మంత్రి అజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని తానా (TANA), ఎన్నారైలు, ఇతర పారిశ్రామికవేత్తల సహకారంతో లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహం (NTR Statue) ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని నిజామాబాద్ కు చెందిన కళాకారుడు వర్మ రూపొందించారు. కాగా, ఈనెల 28న ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ తోపాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొనే అవకాశం ఉంది.