త్వరలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ప్రజలను ఆకర్షించేందుకు వినూత్న పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ గృహలక్ష్మి అనే పథకం ప్రకటించింది. దీనికి పోటీగా తాజాగా కర్ణాటక మంత్రి ఆర్.అశోక ప్రతి పేద కుటుంబానికి తాము రూ.2 వేలు ఇస్తామని ప్రకటించాడు. ఎన్నికల తర్వాత కాదు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ పథకం అమలు చేస్తామని వెల్లడించడం విశేషం.
ఇటీవల కర్ణాటకలో ప్రియాంకగాంధీ పర్యటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకం అమలు చేస్తామని తెలిపింది. ఆ పథకం కింద ఇంట్లోని మహిళ పెద్దకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అంటే నెలకు రూ.24 వేల చొప్పున నగదు సహాయం చేస్తామని చేసిన ఈ ప్రకటనకు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది.
ఈ ప్రకటనతో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ వెంటనే మేల్కొని తాము తక్కువ కాదని.. ఎన్నికల దాకా ఎందుకు ఇప్పుడే అమలు చేస్తామని ప్రకటించింది. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకం ప్రకటిస్తామని కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక చెప్పారు. కర్ణాటకలోని ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.2 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. జూలై నుంచే ఈ పథకం అమలు చేస్తామన్నారు. తమ బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని చెప్పారు. మరోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.