జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఫోన్ చేశారట. విశాఖ గర్జన సమయంలో జరిగిన పరిస్థితుల గురించి ఆరా తీయడానికి చంద్రబాబు ఫోన్ చేసినట్లు జనసేన అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా… ప్రకటించారు.
విశాఖలో పరిణామాలపై చంద్రబాబు ఆరా తీశారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఖరిపై పవన్ తో మాట్లాడారు చంద్రబాబు. జనసేన నేతలపై కేసులు, అరెస్ట్ లను చంద్రబాబు ఖండించారు. పోలీసుల నోటీసులు, పార్టీ నేతల అరెస్ట్ అంశాలపై చంద్రబాబుకు వివరించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో పని చేస్తోందన్నారు.
పవన్ కు నోటీసులు ఇవ్వడం సరికాదన్నారాయన. పవన్ పర్యటనపై ఆంక్షలు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబు. విశాఖపట్నంలో నిన్న గర్జన కార్యక్రమం నిర్వహించగా, జనవాణి కార్యక్రమం కోసం పవన్ కల్యాణ్ నగరంలో అడుగుపెట్టడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఎయిర్ పోర్టులో మంత్రులపై జనసైనికులు దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, జనసేన నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే.
ఆదివారం పవన్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. విశాఖను వీడాలంటూ స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పవన్ కల్యాణ్ కు ఫోన్ చేశారు. పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై పవన్ తో మాట్లాడారు.
వందలమంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందని, జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు చంద్రబాబు. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, తమ నేతల అరెస్టులు తదితర అంశాలపై చంద్రబాబుకు పవన్ వివరించడం గమనార్హం.