నేపాల్లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్ నుండి కాస్కి జిల్లాలోని పోఖరాకు వెళ్తున్న యెతి ఎయిర్ లైన్స్ ప్లేన్ కుప్పకూలింది. ఈ విమానం బయలుదేరిన 20 నిమిషాలకు కుప్పకూలింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 25 నిమిషాలు. మరో 5 నిమిషాలు ప్రయాణిస్తే విమానం గమ్యస్థానం చేరుకునేది. ప్రమాదం సమయంలో 72 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు. ఇందులో ఐదుగురు భారతీయులు సహా 10 మంది విదేశీయులు. ఈ ఘటనలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని నేపాల్ ఆర్మీ సోమవారం తెలిపింది. దాదాపు అన్ని మృతదేహాలను వెలికితీశారు.
ఈ విమానంలోని ఐదుగురు భారతీయుల్లో ఒకరు సోను జైస్వాల్. కిటికీ పక్కన కూర్చొని తన ఫోన్లో ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగర్ చేసి గాల్లో నుండి సిటీ అందాలను చూపించారు. అదే సమయంలో విమానం కుప్పకూలింది. భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఇదంతా లైవి స్ట్రీమింగ్లో రికార్డ్ అయ్యాయి. సోను జైస్వాల్ ఫేస్బుక్ ఖాతాలో కనిపించిన ఈ భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.