Brain Exercises : మెదడు చురుగ్గా ఉంచే వ్యాయామాలు ఇవే!
మెదడు మన శరీరంలోని అవయవాన్నింటి బాస్ అని చెప్పవచ్చు. ఇది తన ఆజ్ఞల ద్వారా శరీరంలో ఎప్పుడు ఏమేమి జరగాలో వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. అలాంటి మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉండాలంటే దానికీ వ్యాయామాలు అవసరమే. ఏంటవి ?
Brain Exercises : మెదడు మనకు మన శరీరానికి బాస్. అది చెప్పినట్లుగానే మనం నడుచుకుంటాం. అందుకనే అది ఎప్పుడూ చురుగ్గా పని చేయాలి. లేదంటే మతిమరుపు, తెలివిగా ఉండలేకపోవడం, అసంకల్పితంగా జరిగే పనుల్లో ఇబ్బందులు తలెత్తడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటినీ అధిగమించాలంటే మెదడుకూ వ్యాయామం( Exercises) అవసరం. మనం ఏమేం చేయడం వల్ల అది చురుగ్గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కడైనా రోజు వారీ పనుల్లో లెక్కలు చూడాల్సి వచ్చినప్పుడు మెదడులో(Brain) లెక్కలు చేసేందుకు ప్రయత్నించండి. పెన్ను, పేపరు, కాలిక్యులేటర్ లాంటి వాటి సహాయం తీసుకోకుండా లోపలే ఈ పని చేయడం అనే దాన్ని అలవాటు చేసుకోండి. ఇది బ్రెయిన్‌కి ఎక్సర్‌సైజ్‌లా పని చేస్తుంది. అలాగే కొత్త భాషల్ని నేర్చుకోవడం అనేది మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ పని చేయడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉంటుందని 2020లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది.
కొందరు బజారు నుంచి ఏమైనా సరుకులు తెచ్చుకోవాలంటే వాటన్నింటితో ఓ జాబితా రాసుకుని ఆ చీటీ పట్టుకుని మార్కెట్‌కి వెళతారు. అయితే మెదడును పదునుగా ఉంచుకోవాలంటే ఈ జాబితా అంతటినీ గుర్తుంచుకుని దుకాణానికి వెళ్లండి. అక్కడ వీటన్నింటినీ తిరిగి గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. ఇలా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు రకరకాల ఆహార పదార్థాలను తింటుంటాం కదా. వాటిలో ఏమేం పదార్థాతలు వాడారో గుర్తించేందుకు ప్రయత్నించండి. వీటిలో వాడిన మసాలాలు, తాలింపులు సహా వీలైనన్ని ఎక్కువ పదార్థాలను గుర్తించండి. అప్పుడు మీ రుచి మొగ్గలు మరింత ఎరుకతో ఉంటాయి.
హ్యాండ్, ఐ కోర్టినేషన్తో చేసే పనులను చేయండి. లేసులు అల్లడం, రాయడం, బొమ్మలు వేయడం, పెయింటింగ్‌లు చేయడం, వీడియో గేమ్‌లు ఆడటం లాంటి వాటి వల్ల మెదడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. తద్వారా దాని పని తీరు మెరుగవుతుంది.