దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా వరుసగా ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంటోంది. గతవారంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును రాజమౌళి టీమ్ దక్కించుకుంది. తాజాగా సియాటెల్ క్రిటిక్స్ పురస్కారాన్ని కూడా ఆర్ఆర్ఆర్ తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీకి గాను ఈ సినిమాకు అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని సియాటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు విక్కీ ఆరోరా, ఇవాన్ కొస్టాడినోవ్, నిక్ పావెల్, రియచో వసిలెవ్ వంటివారు యాక్షన్ స్టంట్స్ కు కోఆర్డినేటర్లుగా పనిచేయగా ప్రేమ్ రక్షిత్, దినేశ్ క్రిష్ణన్ స్టంట్స్ కొరియాగ్రఫీ చేయడం విశేషం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేసులో ఉంది. ఈ మూవీ 14 కేటగిరీల్లో ఆస్కార్ బరిలో ఉండటం విశేషం. జనవరి 24న ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు రావడం పట్ల తెలుగు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.