జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా మహోర్లోఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి ఓ నివాస భవనంపై పడటంతో ఏడుగురు మృతి చెందారు. మరోవైపు, రాంబన్ జిల్లా రాజ్‌గఢ్‌లో క్లౌడ్‌బరస్ట్ సంభవించడంతో వరదలు సంభవించాయి. ఆ వరదల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నాయి.
HYD: అంబర్‌పేట పటేల్‌నగర్‌లో రాజు కుటుంబం నివాసముంటోంది. శుక్రవారం సాయంత్రం చిన్న కుమారుడు రెండో అంతస్తు బాల్కనీలో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
AP: విశాఖలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధంపై ఆర్టీసీ RM అప్పలనాయుడు స్పందించారు. కూర్మన్న పాలెం నుంచి వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగిందన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్పష్టం చేశారు. ప్రమాదన్ని గుర్తించిన బస్సు సిబ్బంది వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారని తెలిపారు. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
HNK: పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడిన జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు నిందితులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1,50,000 విలువ గల మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామని సీఐ శివకుమార్ అన్నారు. రెండు రోజుల క్రితం నిందితులు హమ్మకొండకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
CTR: అబార్షన్ వికటించి 17 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన నగరి మండలం పళ్లిపట్టులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అమ్మాయి నర్సింగ్ చదువుతూ అదే ఊరికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. ఆమె గర్భం దాల్చగా నగరి సమీపంలోని పన్నూరుకు తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. కొన్ని రోజులకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తిరువళ్లూరకు తీసుకెళ్తుండగా దారి మధ్యలో చనిపోయింది.
BHPL: మేడిపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం, చిట్యాల (M) ఒడితెల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి (22) తండ్రి అనారోగ్యంతో మరణించాడు. ఆవేదనతో ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమెపై 6న కేసు నమోదైంది. రహదారి పక్కన మృతదేహం ఆధార్ కార్డు ఉండటంతో వాహనదారులు పోలీసులకు సమాచారమిచ్చారు.
GDWL: మదనపల్లె మండలం కొత్తవారిపల్లి సమీపంలోని నాలుగు లైన్ల రోడ్డులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ధరూర్ మండలం రేవులపల్లికి చెందిన జాన్(28) మదనపల్లెలో కేబుల్ వైర్ పనిచేస్తున్నాడు. ఈ మేరకు పని నిమిత్తం బైక్‌పై వాయల్పాడుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా మదనపల్లె నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే చనిపోయాడు.
TG: కామారెడ్డి జిల్లాలోని సర్వాపూర్ వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. డ్రైవర్, కండక్టర్ సహా ఐదుగురు ప్రయాణికులు కాసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వాగులో చిక్కుకున్న బస్సును గుర్తించిన SDRF టీమ్, చాకచక్యంగా ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. వారిని సర్వాపూర్లోని ప్రైవేట్ స్కూల్ వసతి కేంద్రానికి తరలించారు. మొత్తం ఏడు మంది సురక్షితంగా బయటపడ్డారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ముందస్తు సమాచారం మేరకు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 18 గ్రాముల మెత్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు బొమ్మూరు ఎస్సై రాజులపాటి అంకారావు తెలిపారు. హుకుంపేటకు చెందిన అమన్ పాండే, మండపాటి తేజస్వి వర్ణ్మతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రూ. 1,07,720 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అన్నమయ్య: మదనపల్లె మండలం కొత్తవారిపల్లి సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని 35 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టి పారిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా, మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
కర్ణాటకలోని మంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. బ్రేక్స్ విఫలమై ఆర్టీసీ బస్సు జనంపైకి దూసుకెళ్లింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్ పీఎస్ పరిధిలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రేకుల బావి వద్ద ఓ కారు వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కాగా స్థానికులు వెంటనే గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: జీ.మాడుగుల మండలం కొక్కిరాపల్లి ఘాట్ రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో జీపులో వెళుతున్న పలువురు స్వల్పంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
E.G: ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావు పేటలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప.గో జిల్లా అత్తిలికి చెందిన కే.వెంకట సుబ్బారావు మృతి చెందాడు. ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. చెట్టుకొమ్మ విరిగి ప్రమాదవశాత్తు అతనిపై పడింది. తీవ్రగాయాలైన అతడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ATP: బస్సుల్లో ప్రయాణికులను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్. సుమతి, ఎస్. గీత, ఎస్. రంజిత్, ఎస్. బృంద అనే మహిళలను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి నుంచి రూ. 23 లక్షలు విలువైన 242.5 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.