MNCL: నస్పూర్‌లో సోమవారం భారీ గాలులతో అకాల వర్షం కురిసింది. దీంతో 7వ డివిజన్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ లైన్‌లో ఒక మామిడి చెట్టు, నాలుగు విద్యుత్ స్తంబాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ అక్కడికి చేరుకొని సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
HYDలో కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. 2050 HMDA సమగ్ర మొబిలిటీ ప్లాన్ సర్వే ప్రకారం, ఒక్క గృహం సగటు ఆదాయం రూ.33,894గా నమోదైంది. ఇందులో ప్రయాణ ఖర్చులకే సుమారు రూ.2,000 వరకు వెచ్చిస్తున్నారు. కుటుంబాల్లో కేవలం 40 శాతం మంది మాత్రమే ఆదాయం ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. నగర జీవన ఖర్చులు కుటుంబాలపై భారంగా మారుతున్నాయని పేర్కొంది.
GDWL: అయిజ మండలం సిందనూర్ క్లస్టర్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బోయ శివ మరణించారు. రైతు భీమా పెండింగ్ క్లెయిమ్‌పై అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా బోయ తిరుమలేష్‌కు నోటీసులు జారీ చేశారు. సర్పంచ్ సమక్షంలో విచారణ నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
NZB: ముప్కాల్ మండలం నాగంపేట్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆక్యుప్రెషర్ చికిత్స శిబిరాన్ని సర్పంచ్ గంగాధర్ ప్రారంభించారు. గ్రామప్రజల సౌకర్యార్థం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా ఛైర్మన్ లింగం, జోనల్ ఛైర్మన్ సాగర్ రెడ్డి, కార్యదర్శి గౌతమి తదితరులు పాల్గొన్నారు.
VKB: పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన కె.రఘుకుమార్ ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు సీసీ కెమెరాలు, మైక్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రామచంద్రాపురంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జోరుగా సాగుతుంది. గ్రామంలోని 200కు పైగా కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. పాత పెంకుటిళ్ల నుంచి అధునాతన పక్కా ఇళ్లలోకి చేరుతుండటంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఇళ్లు తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయని స్థానికులు తెలిపారు.
JN: పాలకుర్తి నియోజకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. పాలకుర్తిలో ఓ టీ పాయింట్ వద్ద స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే టీ తాగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సేవకులుగా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని, పాలకుర్తి అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
HYD: నాచారం, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై PCB అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు పలు కంపెనీలపై తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని యూనిట్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కొన్నింటి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, జరిమానాలు విధించారు.
KMM: గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కంపెనీలు సిలిండర్లను డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేయకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. కూసుమంచి సమీపంలోని ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఉదయమే చేరుకుని సిలిండర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన ఏజెన్సీ నిర్వాహకులు గేట్ తెరవకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
KNR: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాసు అవకాశం కల్పిస్తూ BJP రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు ఈ అవకాశం కల్పించడం ద్వారా పార్టీ స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డిని జిల్లా డీపీఆర్‌వో శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విప్‌గా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైన నేపథ్యంలో సత్కరించినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళేందుకు పబ్లిక్ రిలేషన్స్ శాఖ ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందన్నారు.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సోమవారం మొత్తం రూ.1,58,519 ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల ద్వారా రూ.65,944, ప్రసాదాల ద్వారా రూ .81,000, అన్నదానం ద్వారా రూ.11,575 వసూలైనట్లు ఆయన వెల్లడించారు. భక్తుల రాక కొనసాగుతుండటంతో ఆలయ ఆదాయం స్థిరంగా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
RR: జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా గత సంవత్సరం డిసెంబర్ 29 నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,541 ట్రిప్స్‌లో 1,298 టన్నుల నిర్మాణ వ్యర్థాలు సేకరించినట్లు GHMC అధికారులు తెలిపారు. ఈ చర్యతో నగర పరిశుభ్రత మెరుగుపడటంతో పాటు, అనధికారికంగా వ్యర్థాల పారవేతను కూడా నియంత్రించగలిగామని పేర్కొన్నారు. త్వరలో మిగతా చర్యలు సైతం తీసుకుంటామని తెలిపారు.
HYD: నగరంలో గాలి కాలుష్యం పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నరసింహ కాలనీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 218గా నమోదైంది. వాహనాల పొగ, చెత్త దహనం, కట్టెల పొయ్యిల వాడకమే దీనికి ప్రధాన కారణాలని అధికారులు గుర్తించారు. గాలి నాణ్యత క్షీణించడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పు ఉందని వైద్యులు సూచించారు.
BDK: భద్రాచలం పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ధర్మాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. కుంజా ధర్మా నియామకం పట్ల భద్రాద్రి జిల్లా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, భద్రాచలం డివిజన్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించింది.