ADB: పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ, త్యాగం, సోదరభావానికీ ప్రతీక అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విందును స్వీకరించారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం రూ.12,14,835 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.4,47,640, కార్ పార్కింగ్‌తో రూ.1,95,500, VIP దర్శనాలతో రూ.1,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.81,300, ప్రధాన బుకింగ్‌తో రూ.1,05,700, వ్రతాలతో రూ.71,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
NZB: నవీపేట్ మండలం మోకన్పల్లిలోని KGBVని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణలో లోపాలు, గదుల అపరిశుభ్రతపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంఛార్జి స్పెషల్ ఆఫీసర్ కవిత, ఉపాధ్యాయురాలు రాజశ్రీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
NRML: సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో ఏర్పాటుచేసిన నర్సరీని మండల ఎంపీడీవో లక్ష్మీకాంత్ రావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మొక్కలకు క్రమం తప్పకుండా ప్రతిరోజు నీరును అందిస్తూ ఉండాలని తెలిపారు. మొక్కల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరిపే రవళి విలాస్, సెక్రటరీ నరేష్, ఉప సర్పంచ్ గంగన్న, తదితరులు పాల్గొన్నారు.
PDPL: జిల్లాలో 166 సీనియర్ సిటిజన్ కేసులు పరిష్కరించినట్లు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తెలిపారు. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో 130 కేసులు నమోదు కాగా 121 పరిష్కరించాలని తెలిపారు. మంథని పరిధిలో 28 నమోదు కాగా 26 పరిష్కరించినట్లు వెల్లడించారు. 19 అప్పిలేట్ కేసులు నమోదు కాగా, పూర్తిగా పరిష్కరించామని పేర్కొన్నారు.
SRPT: వాహన తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గోవిందాపురంకు చెందిన శ్రీకాంత్ అనే దొంగను అరెస్ట్ చేసినట్టు SI బండి మోహన్ బాబు తెలిపారు. వెంకట్‌నగర్, గోవిందాపురంలో ఇళ్లలో చోరీ చేసిన వస్తువులతో అనుమానాస్పదంగా ఉండడం చూసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి బంగారు పుస్తెలతాడు, నాలుగు జతల దిద్దులు, మూడు జతల వెండి పట్టీలు, రోల్డ్ గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకున్నారు.
JGL: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రాష్ట్ర మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన కిచెన్ షెడ్స్‌ను మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. చదువును మించిన ఆస్తి లేదని అన్నారు.
HNK: రాష్ట్రంలో చేపడుతున్న జై భీమ్ మహాసేన రథయాత్ర జిల్లాకు చేరుకుంది. యాత్ర చేస్తున్న వారికి హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(KVPS) నేతలు ఘన స్వాగతం పలికారు. విద్యాభ్యాసం నుంచే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని, భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేతలు అన్నారు.
SRD: జిల్లాలో ఈనెల 14 నుంచి జరిగే టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లావ్యాప్తంగా 123 కేంద్రాల్లో 24,611 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలి’ అని సూచించారు.
MLG: కన్నాయిగూడెం మండలంలో ఆస్పిరేషన్ బ్లాక్ సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమం అమలును పరిశీలించేందుకు నితి ఆయోగ్ కన్సల్టెంట్ శ్రీ కృష్ణన్ గోపాల్ పర్యటించారు. మండలంలోని పాఠశాలలు, ఆంగన్‌వాడీ కేంద్రాలు, విద్యార్థి వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పోషకాహారం, బోధన విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
SRCL: మతపరమైన సేవలతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా, పాస్టర్లు ప్రజల్లో మంచి మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో జరిగిన, జిల్లా ఫాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంకు ఆయన హాజరయ్యారు.
KMM: మధిర బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది చింతల గోపాల్ వివరాలు వెల్లడించారు. అధ్యక్ష పదవికి రామరాజు, రమేష్‌తో పాటు చివరి రోజు పుల్లారావు, కృష్ణారావు నామినేషన్ దాఖలు చేయడంతో మొత్తం నలుగురు పోటీలో ఉన్నారు. ఇతర పదవులకు కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు.
SDPT: చిన్నకోడూరు మండలం పెద్దకోడూరుకు చెందిన మోతే ఐలేశ్ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ చికిత్స ఖర్చుల నిమిత్తం అతనికి మంజూరైన రూ. 2 లక్షల LOC చెక్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ సునీత మధు ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
MNCL: లక్షెట్టిపేటకు చెందిన లకావత్ గణేష్ (45) వడదెబ్బతో మృతి చెందాడని ఏఎస్సై అన్వర్ తెలిపారు. గణేష్ మంగళవారం కొడుకు రాజేశ్వర్‌ను రూ. 20 అడిగి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదన్నారు. బుధవారం ఉదయం ఇటిక్యాల చెరువు వద్ద గణేష్ శవం ఉందని స్థానికులు చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారన్నారు. గణేష్ చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి వడదెబ్బ తగిలి మృతి చెందాడన్నారు.
BHPL: రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, సన్న వడ్ల బోనస్ వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ మహాముత్తారం మండల కేంద్రంలో బీజేపీ నేతలు బుధవారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు పూటకు ఒక అబద్దం చెబుతూ.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. లేదంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని హెచ్చరించారు.