• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కొందుర్గులో రేపు ఉగాది వేడుకలకు ఆహ్వానం

RR: కొందుర్గు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపు పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఉదయం 6 గంటలకు స్వామివారికి విశేష అభిషేకం, సాయంత్రం 4 గంటలకు పల్లకి సేవ, రాత్రి 7 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది.

March 18, 2026 / 02:15 PM IST

రాహుల్, ప్రియాంకలను కలిసిన ఎంపీ ‘చామల’

BHNG: రెండో విడత సమావేశాల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, ఇతర ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో, వారు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను ఇవాళ కలిశారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అడ్డుతగలడాన్ని నిరసిస్తూ వెల్‌లోకి వెళ్లిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ సమావేశాలకు హాజరయ్యారు.

March 18, 2026 / 02:15 PM IST

విద్యుత్ కనెక్షన్లలో సౌకర్యమంతమైన మార్పులు: SE

HNK: వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్ల విధానంలో మరింత సౌకర్యవంతమైన మార్పులు తీసుకున్నట్లు NPDCL HNK SE మధుసూదన్ రావు తెలిపారు. కొత్త విధానం ప్రకారం 1 కిలోవాట్ వ్యవసాయ కనెక్షన్‌కు కేవలం ₹1000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ మార్పులతో కనెక్షన్ పొందడం సులభతరం, వేగవంతం, పూర్తిగా పారదర్శకంగా మారిందన్నారు.

March 18, 2026 / 02:14 PM IST

వట్టిమర్తిలో పారిశుద్ధ్య పనులు వేగవంతం

NLG: వట్టిమర్తి గ్రామంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 8వ వార్డులో పారిశుద్ధ్య పనులను వార్డు సభ్యుడు మేడి హరికృష్ణ వేగవంతం చేశారు. పంచాయతీ సిబ్బందితో కలిసి వార్డు అంతటా బ్లీచింగ్ పౌడర్ చల్లించే పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. వార్డులో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూస్తానని, సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సహకారంతో 8వ వార్డును ఆదర్శంగా నిలుపుతానన్నారు.

March 18, 2026 / 02:14 PM IST

24న నందిపేట్ త్రైబజార్ వేలం

NZB: నందిపేట్ గ్రామపంచాయతీ 2026-27 సంవత్సరానికి త్రైబజార్ (సోమవారం అంగడి, రోజువారీ సంత) వేలంపాటను మార్చి 24, 2026 మంగళవారం నిర్వహించనున్నారు.  ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యాలయంలో ఈ వేలాన్ని నిర్వహించనున్నట్లు కార్యదర్శి మహేందర్ బుధవారం తెలిపారు. పాల్గొనదలచిన వారు నిర్ణీత డిపాజిట్‌తో హాజరుకావాలన్నారు.

March 18, 2026 / 02:14 PM IST

ప్రమాదకరంగా మారిన ధర్మారం బస్టాండ్

PDPL: మంథని మండలం ధర్మారం బస్టాండ్ ప్రమాదకరంగా మారింది. పిల్లర్లు, పైకప్పు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఎండలో, వర్షంలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నూతన బస్టాండ్‌ను రోడ్డుకు దగ్గరగా ప్రజలకు అందుబాటులో నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

March 18, 2026 / 02:14 PM IST

అసెంబ్లీలో గళం విప్పిన MLA

MBNR: అసెంబ్లీలో బుధవారం జరిగిన క్వశ్చన్ అవర్‌లో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడారు. జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 25 వెంటిలేటర్ బెడ్లకు అదనంగా మరో 25 బెడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగిన దృష్ట్యా, వైద్యుల సంఖ్యను కూడా పెంచాలని ఆయన తెలిపారు.

March 18, 2026 / 02:12 PM IST

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్

BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాల భవన దుస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే మరమ్మత్తులు, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

March 18, 2026 / 02:09 PM IST

అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

MHBD: ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతాంగానికి మేలు చేయాలని, మక్కలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు రైతు సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు మాట్లాడుతూ… రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలన్నారు.

March 18, 2026 / 02:07 PM IST

పదవ తరగతి పరీక్షల్లో 100% హాజరు: MEO

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో 100% మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హిందీ పరీక్ష నేపథ్యంలో ఐదు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 816 మంది విద్యార్థులకు గాను 100% మంది పరీక్షకు హాజరయ్యారని ఆయన ప్రకటించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

March 18, 2026 / 02:06 PM IST

త్వరలో కొత్త డిజిటల్ మీడియా పాలసీ: మంత్రి పొంగులేటి

KMM: రాబోయే రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో డిజిటల్ మీడియా పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. శాసన మండలిలో జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన ఆయన, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు, అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు.

March 18, 2026 / 02:05 PM IST

పిచ్చికుక్కల దాడి.. 4 గొర్రెలు మృతి

JN: దేవరుప్పుల మండల కేంద్రంలో పిచ్చికుక్కల దాడిలో 4 గొర్రెలు మృతి చెందగా, సుమారు 25 గొర్రెలు గాయపడ్డాయి. బుధవారం గొర్రెల షెడ్డులో ఉన్న గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో ఈ ఘటన జరిగింది. సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు.

March 18, 2026 / 02:05 PM IST

సీఎం పర్యటనను అడ్డుకుంటాం: MRPS

SDPT: సీఎం రేవంత్ రెడ్డి నర్మెట పర్యటనను అడ్డుకుంటామని MRPS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవులపల్లి రాజేందర్ హెచ్చరించారు. నంగునూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు,రాజీవ్ యువ వికాసం అమలు చేయని సీఎం తీరుకు నిరసనగా దళిత సామాజిక వర్గాలను ఏకం చేస్తామని ప్రకటించారు.

March 18, 2026 / 02:03 PM IST

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

SDPT: జగదేవ్‌పూర్ మండల వ్యాప్తంగా ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది .ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం వల్ల ఎండ వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

March 18, 2026 / 02:02 PM IST

పారుపల్లిలో తోఫా పంపిణీ

BHNG: ఆత్మకూరు ఎం మండలంలోని పారుపల్లి గ్రామ ముస్లిం సోదరి, సోదరులకు రంజాన్ తోఫాను సర్పంచ్ దయల మాధవి -శ్రీనివాస్ అధ్వర్యంలో పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పృథ్వి, ఉప సర్పంచ్ తవిటి మల్లారెడ్డి, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు నర్సిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పాల్గొన్నారు.

March 18, 2026 / 01:50 PM IST