• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పట్టుబడితే కఠిన శిక్షలు: కలెక్టర్

ELR: జిల్లాను మాదకద్రవ్య రహితంగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలతో యువత భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

April 1, 2026 / 08:37 AM IST

బద్వేలులో రికార్డు స్థాయిల్లో పన్నుల వసూళ్లు

KDP: బద్వేల్ పురపాలక సంఘంలో ఆస్తి పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. ఒకే రోజు రూ.46.50 లక్షలు వసూలైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఫీల్డ్ సిబ్బంది వసూళ్లు కొనసాగుతుండడంతో మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.8.30 కోట్లకు పైగా పన్నులు వసూలైనట్లు వెల్లడించారు.

April 1, 2026 / 08:35 AM IST

అమలాపురంలో “స్టాప్, వాష్ అండ్ గో” కార్యక్రమం

కోనసీమ: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు “స్టాప్, వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం ముమ్మరంగా నిర్వహిస్తోంది. పోలీసులు అమలాపురంలో మంగళవారం అర్ధరాత్రి, తెల్లవారుజామున డ్రైవర్లను గుర్తించి, నీళ్లతో ముఖం కడిగించి, వారు పూర్తిగా అప్రమత్తమైన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

April 1, 2026 / 08:34 AM IST

పెద్దబండ తాండలో తుల్జా భవాని పూజ

WNP: గోపాల్‌పేట మండలంలోని పెద్దబండ తాండలో తుల్జా భవాని పూజను బంజారా సంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించారు. తండావాసులు సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేస్తూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.

April 1, 2026 / 08:34 AM IST

సంవత్సరం గడిచినా అందని రాజీవ్ యువ వికాస్

HNK: ఉమ్మడి జిల్లాలో యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం అమలులో ఆలస్యం జరుగుతోందని యువకులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం ప్రకటించిన ఈ పథకానికి SC, ST, BC మైనార్టీ వర్గాలకు చెందిన 1,22,636 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి మోక్షం కలగలేదని అన్నారు. ప్రభుత్వ స్పందించి ఆర్థిక భరోసా అందించాలని కోరారు.

April 1, 2026 / 08:33 AM IST

హక్కులపై అవగాహన కల్పించిన తహసీల్దార్

ADB: నార్నూర్ మండలంలోని గుండాల గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ జాడి రాజలింగు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్థులకు రాజ్యాంగ హక్కులు, పౌర బాధ్యతలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 1, 2026 / 08:33 AM IST

లింగ నిర్ధారణపై కఠిన నిఘా అవసరం: DMHO

KMM: ఆడశిశు గర్భస్రావాలు, గర్భపాతాలు, లింగనిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలపై కఠిన నిఘా అవసరమని DMHO డా.రామారావు తెలిపారు. జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గకుండ ఉండటం కోసం PCPNDT చట్టం-1994ను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులు, సంస్థలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని హెచ్చరించారు.

April 1, 2026 / 08:33 AM IST

రహదారిని పరిశీలించిన మంత్రి సవిత

SS: రొద్దం మండలంలో నూతనంగా నిర్మించిన రహదారిని మంత్రి సవిత బుధవారం పరిశీలించారు. పావగడ ప్రధాన రహదారి నుంచి దొడగట్ట గ్రామం వరకు రూ.10.25 కోట్ల నిధులతో ఈ రోడ్డు పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రహదారి నాణ్యతను అధికారులతో కలిసి ఆమె స్వయంగా తనిఖీ చేశారు. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

April 1, 2026 / 08:31 AM IST

నేడు మరోసారి కస్టడీకి తీసుకోనున్న పోలీసులు

RR: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు ఇవాళ మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మలకు మూడు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు పోలీసులు వారిని విచారించనున్నారు. కాగా, చంచల్ గూడ జైలులో నిందితులను మరికాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు.

April 1, 2026 / 08:31 AM IST

నిరుపయోగంగా మారిన వన మయూరి వాహనం

WGL: న్యూశాయంపేటలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ‘వన మయూరి’ సంచార జంతు ప్రదర్శన వాహనం గత 15 ఏళ్లుగా ఉపయోగం లేక మూలన పడి ఉందని ప్రజలు ఆరోపించారు. పర్యావరణం, జంతు సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ వాహనం పాడై నిరుపయోగంగా మారిందని వాపోయారు. అధికారులు స్పందించి వాహనాన్ని మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు.

April 1, 2026 / 08:31 AM IST

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

CTR: చిత్తూరు జిల్లాలో రసాయనాల ఉత్పత్తుల పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలుతో మరియు జిల్లా అధికారులతో పరిశ్రమల ప్రమాదాల నివారణపై ముందస్తు చర్యల అమలులో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

April 1, 2026 / 08:30 AM IST

విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

SRPT: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు జ్యోతుల రామకృష్ణ (54) మృతి చెందిన ఘటన నెలకొంది. సీఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సూర్యాపేట నుంచి బొప్పారం వెళ్తుండగా అచ్యుత తండా సమీపంలో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రామకృష్ణ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.  

April 1, 2026 / 08:30 AM IST

కొత్తపల్లిలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

KNR: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన యువకుడు కొత్త శ్రావణ్ (26) తన నివాసంలో ఉరివేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 1, 2026 / 08:27 AM IST

గోల్నాకలో ఈనెల 19న ‘హిందూ సమ్మేళనం’

HYD: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ హిందూ సమాజ ఐక్యత కోసం ఈనెల 19న సాయంత్రం 5 గంటలకు గోల్నాక మార్కెట్‌లో ‘హిందూ సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిప్రసాద్, సాయిమురలి తదితరులు పాల్గొన్నారు. హిందువులందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమితి సభ్యులు పిలుపునిచ్చారు.

April 1, 2026 / 08:24 AM IST

కల్తీ పాల ఘటన.. కోలుకుంటున్న చిన్నారులు

E.G: రాజమండ్రి నగరంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ఎం.ఆర్.ఆర్ తార్వి, డీ. రితిక్ అనే ఇద్దరు చిన్నారులు కోలుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందగా, మరో ఇద్దరు ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని వారు చెప్పారు.

April 1, 2026 / 08:24 AM IST