TG: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం రామాలయంలో అద్భుతం జరిగింది. హనుమాన్ దీక్షాధారులు పూజలు నిర్వహిస్తుండగా, ఓ వానరం నేరుగా ఆలయంలోకి ప్రవేశించింది. మంగళ హారతి ముగిసే వరకు శ్రద్ధగా కూర్చుని, అనంతరం స్వామి విగ్రహానికి మొక్కింది. అంతటితో ఆగక, తీర్థాన్ని తాగి వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు సాక్షాత్తూ ఆ బజరంగబలే వానర రూపంలో వచ్చి దర్శనమిచ్చారని పులకించిపోయారు.
కృష్ణా: ప్రస్తుత సర్పంచుల పదవీకాలం రాబోయే ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్న నేపథ్యంలోగుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు సోమవారం సన్మాన కార్యక్రమం జరిగింది. మండలంలోని సర్పంచులను ఎంపీడీవో ఇమ్రాన్ పూలమాలలతో సత్కరించి, శాలువాలు కప్పి, మెమెంటోలు అందజేశారు. సర్పంచులు తమ పదవీకాలంలో గ్రామాభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
HYD: పికెట్ గాంధీ నగర్‌కు చెందిన ఇందిర, లాలాపేట్‌కు చెందిన జకారి బాబులకు చికిత్స నిమిత్తం వైద్య ఖర్చులకు ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ను సంప్రదించారు. ప్రభుత్వం ద్వారా వైద్యం చేయించి, చెరో రూ.2 లక్షల చొప్పున LOCలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వారిరువురూ త్వరగా కోలుకుని మనసారా కోరుకున్నారు.
BDK: వేసవి తీవ్రత దృష్ట్యా మణుగూరు నుంచి హైదరాబాద్ వరకు ఆర్టీసీ ఏసీ బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం మణుగూరు నుంచి నాన్-ఏసీ బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఎండల సమయంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం స్పందించి, ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ సర్వీసులను అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
KKD: తుని మండలం లోవ క్షేత్రంలో తలంపులమ్మ వెలిశారు. దేశంలో ఉత్తరాది, దక్షిణాదిలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. రూ.4.5 కోట్లతో నిర్మిస్తున్న ఎస్కలేటర్ పనులు పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. భక్తులు కొండ ఎక్కేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. ఇంత వరకు దేశంలో ఏ ఆలయానికి ఎస్కలేటర్ లేదని ఆయన తెలిపారు.
WGL: వరంగల్‌లో కేంద్ర ఉన్నత విద్యాసంస్థల ఆవశ్యకతపై లోక్ సభలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. వరంగల్ నియోజకవర్గంలో ఒక్క NIT మాత్రమే ఉందని, NIT వరంగల్‌కు కేటాయించిన రూ.64.38 కోట్ల నిధులు సరిపోవని, కొత్త కేంద్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ కడియం కావ్య కోరారు.
BHPL: ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్, ఆన్‌లైన్ బెట్టింగ్లకు యువత దూరంగా ఉండాలని ఎస్సై పోచంపల్లి సతీష్ హెచ్చరించారు. బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ వెరిఫికేషన్లకు ఆటంకం కలుగుతుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి భవిష్యత్తును కాపాడుకోవాలని అన్నారు.
SKLM: గగంగువారి సిగడాం మండలంలో మడ్డువలస ప్రాజెక్ట్ కాలువ పనుల పురోగతిని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు సోమవారం పరిశీలించారు. దేవరవలస వద్ద చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ.26 కోట్ల 90 లక్షల నిధులతో ఫేజ్-2 పనులు జరుగుతున్నాయన్నారు. ఖరీఫ్ సీజన్‌కు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
VKB: మర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏటా నిర్వహించే తై బజార్ బహిరంగ వేలం పాట ఇవాళ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ రామేశ్వర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వ్యాపారస్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కర్నె పెంటయ్య అత్యధికంగా రూ.6,77,000లకు పాడి తై బజార్ ఈ ఏడాది నిర్వహణ హక్కులను దక్కించుకున్నాడు.
మంచిర్యాల జిల్లాలోని దివ్యాంగులకు ఏప్రిల్ నెలలో సదరం వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు DRDO కిషన్ సోమవారం తెలిపారు. గతంలో మార్చి 26 వరకు నమోదు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత పత్రాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హాజరు కావాలని సూచించారు. సంబంధిత తేదీలలో క్యాంపునకు హాజరు అగుటకు సంబంధిత అభ్యర్థి సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించనున్నట్లు తెలిపారు.
సాధారణ ప్రయాణికులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో 11 విమానాశ్రయాల్లో ‘ఉడాన్ యాత్రి కెఫే’లను ప్రారంభించింది. వీటిలో టీ, కాఫీ, వాటర్ బాటిల్ వంటివి కేవలం రూ.10 నుండి రూ.20లకే లభిస్తాయి. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వీటితో పాటు ఉచిత వైఫై, గ్రంథాలయం, కిడ్స్ జోన్ వంటి సౌకర్యాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరల భారం తగ్గనుంది.
SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. జంగం అంజయ్య అనే వ్యక్తి ఇవాళ కరెంటు షాక్‌తో మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాగా, ప్రస్తుతం అంజయ్య సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: కొడవలూరు (మం) గండవరం పొలాల సమీపంలో జంట హత్యల ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల అడిషనల్ ఎస్పీ సౌజన్యతో కలిసి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాసరావు, పోలీసు సిబ్బందిని హత్యలు జరిగిన విధానంపై ఆరా తీశారు. ఏ ఒక్క ఆధారం వదలకుండా కేసును త్వరితగతిన చేధించాలని సిబ్బందికి సూచించారు.
KNR: గంగాధర మండలం నాగిరెడ్డిపూర్‌లో సోమవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహాసీల్దార్ కళావతి మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధించబడిందని, సమాజంలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసి మెలిసి జీవించాలని ఆమె సూచించారు.
SRPT: అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అనంతుల మధు, నాయకులు సునీల్, సంతోష్ రెడ్డి, భూక్యా నాగులను చివ్వెంల పోలీసులు ఇవ్వాళ ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు.