ఎండల వల్ల వచ్చే చెమటకాయల నుండి ఉపశమనం పొందేందుకు గంధం, ముల్తానా మట్టి, కలబంద జెల్ వాడటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. వేపాకులను వేసి మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగి శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. సమస్య తీవ్రమైతే వెంటనే చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది.
ఎండాకాలంలో ఎండ తీవ్రత వల్ల చర్మం నల్లగా మారడం (ట్యాన్) సర్వసాధారణం. అయితే, ఈ సమస్యకు మామిడి పండుతో ఇంట్లోనే సులభంగా పరిష్కారం పొందవచ్చు. మామిడి గుజ్జులో శెనగపిండి, బాదం పొడి, తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం మళ్లీ కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ వాడే ముందు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి బార్లీ నీళ్లు ఒక అద్భుతమైన పానీయం. ఇవి శరీరానికి తక్షణమే చలువను అందించి, డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి. బార్లీలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. కిడ్నీల ఆరోగ్యానికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అందుకే ఎండల వేళ బార్లీ నీళ్లు తాగడం ఎంతో మేలు.
వేసవిలో తాటిముంజలు తింటే శరీరాన్ని చల్లబరిచి, అలసటను తగ్గించి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, గ్యాస్, మలబద్ధకం, కడుపు మంట సమస్యలను తగ్గిస్తుంది. తాటిముంజల్లో ఉండే అధిక నీటిశాతం వేసవిలో శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది. ముంజల గుజ్జును చర్మంపై రాసుకోవడం వల్ల వేసవిలో వచ్చే మొటిమలు, దద్దుర్లు తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
రాత్రి ఎనిమిది గంటలు నిద్రించినా మర్నాడు నీరసంగా ఉంటే అది ఐరన్ లోపం లేదా థైరాయిడ్ లేదా స్లీప్ అప్నియా కావొచ్చు. దీన్ని నివారించడానికి పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. పడకగదిలో ఫోన్ వాడకం తగ్గించి, వెలుతురు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోడా, కూల్ డ్రింక్స్‌లోని చక్కెర, ఫాస్పోరిక్ ఆమ్లం వల్ల ఊబకాయం, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి కేవలం ఖాళీ క్యాలరీలను ఇచ్చి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటికి బదులు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ లేదా తాజా పండ్ల రసాలు తాగడం ఎంతో మేలు. ఇవి దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడానికి ‘వేడి’ ప్రధాన శత్రువు. హెల్తీ స్పెర్మ్ కోసం వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2°C- 3°C తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకోవడం, టైట్ జీన్స్ ధరించడం, వేడి సీట్లపై కూర్చోవడం వల్ల వీర్యకణాల నాణ్యత, కదలిక మందగిస్తాయి. కాటన్ లోదుస్తులు ధరించండి. బైక్ సీటు చల్లారిన తర్వాత కూర్చోండి.
మైగ్రెయిన్ తగ్గాలంటే సరైన జీవనశైలి అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 3 లీటర్ల నీరు తాగడం, తగినంత నిద్ర, సమయానికి భోజనం వంటివి ముఖ్యం. ఖాళీ కడుపుతో టీ, కాఫీలకు బదులు కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నొప్పి తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది.
బొప్పాయి గింజల్లో అపారమైన పోషకాలు ఉన్నాయి. ఇవి లివర్‌ను శుద్ధి చేయడమే కాకుండా, కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు 5 నుండి 8 గింజలను నేరుగా లేదా పొడి రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గుతారు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం వీటిలో ఉంది. అయితే, గర్భిణీలు మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మెరిసే చర్మం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. రెండు స్పూన్ల శనగపిండిలో కొంచెం పెరుగు కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది చర్మాన్ని శుభ్రం చేసి కాంతినిస్తుంది. మచ్చలు తగ్గి ముఖం మెరవాలంటే తేనె, నిమ్మరసం మిశ్రమం మంచిగా పనిచేస్తుంది. రోజూ పడుకునే ముందు అలోవెరా జెల్ రాస్తే చర్మం మృదువుగా మారుతుంది. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం వల్ల టాక్సిన్స్ తొలగి చర్మం సహజంగా మెరుస్తుంది.
బంగ్లాదేశ్‌లో గత 20 ఏళ్లలో లేనంతగా తట్టు వ్యాధి విలయతాండవం చేస్తోంది. టీకా కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ఇప్పటివరకు 143 మంది మరణించగా, 12,000 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. మృతులలో ఎక్కువమంది చిన్నారులే ఉండటం విషాదకరం. ప్రస్తుతం UNO సహకారంతో ప్రభుత్వం 12 లక్షల మంది పిల్లలకు అత్యవసరంగా టీకాలు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
భారతీయులకు అమెరికన్లలా పింక్ లిప్స్ ఉండకపోవడానికి కారణం ‘మెలనిన్’ అని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి నుండి రక్షణ కోసం మన చర్మం ఎక్కువ మెలనిన్ ఉత్పత్తి చేస్తుంది. అందుకే పెదవులు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి. విదేశీయులలో మెలనిన్ తక్కువగా ఉండటం వల్ల వారి పెదవులు పింక్ కలర్‌లో కనిపిస్తాయి. ఇది కేవలం జన్యుపరమైన మార్పు మాత్రమే.
వేసవిలో మండే ఎండలతో శరీరం త్వరగా శక్తిని కోల్పోతుంది. దీంతో బాడీ నిరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో శీతల పానియాలు, కొబ్బరి నీళ్లు తీసుకుంటారు. వాటితో పాటు పుచ్చకాయ, నారింజ పండ్లు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి ద్వారా శరీరానికి మంచి హైడ్రేషన్ అందుతుంది. కీరదోస, అనాసపండు , స్ట్రాబెర్రీలు కూడా తక్షణ శక్తినిస్తాయని చెబుతున్నారు.
ఉత్తర భారత వేసవి పానీయాలు కేవలం దాహం తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పచ్చి మామిడితో చేసే ఆమ్ పన్నా ఎండదెబ్బ నుంచి రక్షిస్తే, జీలకర్ర, పుదీనాల జల్జీరా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇక పాలు, డ్రై ఫ్రూట్స్ కలిపిన ఠండాయి శరీరానికి చల్లదనం, శక్తిని ఇస్తుంది. కృత్రిమ పానీయాల కంటే ఈ సహజ సిద్ధమైన పానీయాలే వేసవి తీవ్రతను తట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కొంతమంది ఎంత తిన్నా సన్నగా ఉండటానికి వేగవంతమైన జీవక్రియ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు లెప్టిన్ హార్మోన్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఆహారంతో పాటు వారి జన్యువులు, తగినంత నిద్ర, చురుకైన జీవనశైలి, మెరుగైన జీర్ణక్రియ వంటి అంశాలు వారు బరువు పెరగకుండా, ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వారు ఆరోగ్యంగా కనిపిస్తారట.