• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్‌కు జాతీయ గుర్తింపు

కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ప్రవేశపెట్టిన ‘స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్’ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్ట్‌కు గాను ఆయనకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. మార్చి 28న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు స్వీకరించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ఈ ప్రాజెక్ట్ మోడల్‌గా నిలిచింది.

March 24, 2026 / 02:51 PM IST

రంగంపేటలో ‘రైతన్నా- మీకోసం’ కార్యక్రమం

E.G: రంగంపేటలో మంగళవారం ‘రైతన్నా- మీకోసం’ కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలిపారు. ఈ ప్రచారంలో రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు హామీ ఇచ్చారు.

March 24, 2026 / 02:50 PM IST

రైలులో మహిళా ప్రయాణికురాలు మృతి

ATP: గుత్తి రైల్వే జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగర్సోయిల్-చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న విజయ రమణి అనే మహిళ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మధురైకి చెందిన ఆమె.. కుటుంబ సభ్యులతో కలిసి నాగర్సోయిల్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అధిక షుగర్ కారణంగా ఆమె మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

March 24, 2026 / 02:50 PM IST

‘రణభేరి 3.0’ నిరాహార దీక్షలు

W.G: ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ మంగళవారం ‘రణభేరి 3.0’ నిరాహార దీక్షలు జరిగాయి. పీఆర్సీ, ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని 20 మంది సభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఆకివీడు యూనియన్ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

March 24, 2026 / 02:47 PM IST

జాతీయ విలువిద్య ఛాంపియన్‌షిప్‌కు మంత్రికి ఆహ్వానం

అన్నమయ్య: చెరుకూరి లెనిన్–వోల్గా మెమోరియల్ NTPC ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ విలువిద్య(ఆర్చరీ) ఛాంపియన్‌షిప్‌కు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ పోటీలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జరుగనున్నాయి.

March 24, 2026 / 02:46 PM IST

ఎరువుల వ్యాపారులతో పోలీసుల సమావేశం

ELR: ధర్మాజీగూడెం ఎరువుల వ్యాపారులతో మంగళవారం సీఐ క్రాంతికుమార్, ఎస్సై వెంకన్న అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు విక్రయించరాదని, ప్రభుత్వం నిషేధించిన రసాయనాలు, పురుగుమందులను నిల్వ ఉంచినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వ్యాపారులు ఎలాంటి డిపాజిట్లు సేకరించకూడదని సూచించారు.

March 24, 2026 / 02:46 PM IST

ఆదోనిలో ఇళ్ల హామీలపై సీపీఐ ఆందోళన

KRNL: ఇళ్ల సమస్యపై ఆదోనిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ఖాళీ హామీలు ఇస్తోందని విమర్శించారు. పేదలకు ఇళ్లు, భూములు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. హామీలు వెంటనే అమలు చేయకపోతే పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

March 24, 2026 / 02:45 PM IST

కనిగిరిలో అంబేద్కర్ విగ్రహ పనుల పరిశీలన

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలోని ఒంగోలు బస్టాండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంశ్య విగ్రహ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని ఆరా తీసి, నాణ్యతలో రాజీపడకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విగ్రహం పరిసరాల్లో శుభ్రత, సౌకర్యాల ఏర్పాటు పై కూడా పలు సూచనలు చేశారు.

March 24, 2026 / 02:32 PM IST

పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఐజీపీ

కృష్ణా: మచిలీపట్నంలో వివిధ పోలీస్ స్టేషన్లను ఐజీపీ అశోక్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. జిల్లాలో గంజాయి, క్రైమ్, మహిళలపై దాడుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. ఎస్పీ పి. విద్యాసాగర్ నేతృత్వంలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. రౌడీషీటర్లపై స్పెషల్ నిఘా కొనసాగుతోందని ఐజీపీ స్పష్టం చేశారు.

March 24, 2026 / 02:32 PM IST

శ్రీ అభయ గణపతి వార్షికోత్సవం

VSP: జీవీఎంసీ 12వ వార్డు పెద్దగదిలి సాలిపేటలోని శ్రీ అభయ గణపతి ఆలయ 7వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్‌కు ఆలయ సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈమేరకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వాదం, తీర్థప్రసాదాలు అందించారు.

March 24, 2026 / 02:30 PM IST

మంత్రిని కలిసిన కావలి ఎమ్మెల్యే

నెల్లూరుకు విచ్చేసిన మంత్రి ఫరూక్‌ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కావలి నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, కాలువలు, విద్యా, వైద్య సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

March 24, 2026 / 02:30 PM IST

గోకవరంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీల ప్రజా వేదిక

E.G: గోకవరం ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల ప్రజా వేదిక జరిగింది. పీడీ నాగేశ్వరరావు, ఏపీడీ రాంప్రసాద్, డీవీవో రత్న కుమారి ఉపాధి హామీ పనుల రికార్డులను పరిశీలించారు. పనుల నిర్వహణలో నిబంధనలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఎస్ఆర్‌పీ కేవీ రమణ, ఏపీవో అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

March 24, 2026 / 02:30 PM IST

వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెండి శంఖం బహుకరణ

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ముమ్మిడివరం మండలం అన్నంపల్లి వాస్తవ్యులు మట్టపర్తి మరిడి కుమార్ కుటుంబ సభ్యులు 307 గ్రాముల వెండి శంఖంను బహుకరించారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు.

March 24, 2026 / 02:20 PM IST

సీహెచ్‌సీలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సీహెచ్‌సీలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

March 24, 2026 / 02:15 PM IST

‘పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు’

ELR: మొండి బకాయి దారులు ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు హెచ్చరించారు. మంగళవారం ఉంగుటూరులో గ్రామపంచాయతీ వారు వసూళ్లు చేస్తున్న ఇంటి పన్నులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి బొడ్డు వెంకట రవిచంద్ర కుమార్ పాల్గొన్నారు.

March 24, 2026 / 02:14 PM IST