»Shetkari Sanghatana Writes Letter To Brs Party Chief K Chandrashekar Rao
మహారాష్ట్రలో KCRకు జోష్.. చేతులు కలుపుతామన్న షెట్కారీ సంఘటన్
షెట్కారీ సంఘటన్ కలిసి పని చేయడానికి ముందుకు రావడం కేసీఆర్ కు మరింత బలం ఇవ్వనుంది. మరి వీరి లేఖకు కేసీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వీళ్లు కలిసి వస్తామని చెప్పడంతో కేసీఆర్ వారిని స్వాగతించే అవకాశం ఉంది. త్వరలోనే ప్రగతి భవన్ కు షెట్కారీ సంఘటన్ ప్రతినిధులు రానున్నారు.
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన బీఆర్ఎస్ పార్టీకి (Bharat Rashtra Samithi- BRS Party) మహారాష్ట్ర (Maharashtra) లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao) భారీ బహిరంగ సభ నిర్వహించి మరాఠా గడ్డపై ప్రకంపనలు రేపారు. మరాఠా రాజకీయాల్లో కేసీఆర్ అలజడి సృష్టించారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS Party)పై చర్చ జరుగుతోంది. ఆ పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకులు కేసీఆర్ కు జత కలిశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ (Ab Ki Baar Kisan Sarkar) అంటూ కేసీఆర్ ప్రకటించిన విధానానికి ఆకర్షితులయ్యారు. దీంతో ‘మీతో సమావేశం కావడానికి సమయం వెచ్చించండి’ అంటూ కేసీఆర్ కు లేఖ రాశారు.
మహారాష్ట్రలో షెట్కారీ సంఘటన్ (Shetkari Sanghatana) అనే రైతు సంఘం ప్రముఖమైనది. ఆ రాష్ట్రంలో జరిగే రైతు ఉద్యమాలకు షెట్కారీ సంఘటన్ కేంద్రంగా ఉంటోంది. ఇటీవల నాందేడ్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ చేసిన ప్రసంగం షెట్కారీ సంఘటన్ ను ఆకర్షించింది. రైతులకు మేలు చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో షెట్కారీ సంఘటన్ బీఆర్ఎస్ తో జత కట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే బుధవారం షెట్కారీ సంఘటన్ లేఖ రాసింది. షెట్కారీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ సుధాకరరావు బిందు (Sudheer Sudhakar Rao) నేతృత్వంలో 52 మంది నేతలు లేఖ రాశారు.
‘నాందేడ్ (Nanded District)లో మీ బహిరంగ సభ అనంతరం రైతులకు మంచి జరగబోతోందని మాకు అర్థమైంది. ఇది ఎంతో ఊరటను ఇచ్చే అంశంగా మహారాష్ట్ర రైతులు భావిస్తున్నారు. కొద్దిరోజుల కిందట మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పలు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఒక రాష్ట్రానికి చెందినవారు మరో రాష్ట్రానికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారని మేం ఆసక్తిగా పరిశీలించాం. దీనిపై 40 గ్రామాల్లో మేం పర్యటించగా.. ప్రతి గ్రామంలో ప్రజలు తెలంగాణ ప్రభుత్వం పథకాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రైతు బంధు గురించి ప్రముఖంగా తెలిపారు. అయితే ఈ పథకాలు వాస్తవంగానే తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) అమలు చేస్తుందా అని తెలుసుకునేందుకు తెలంగాణలోని పలు గ్రామాల్లో పర్యటించాం. మా దృష్టిలో భారతీయ రైతులకు మార్షల్ మీరు. మహారాష్ట్రలో మీ ఉనికి రైతులను ఉత్తేజపరుస్తోంది. రైతు ఉద్యమంలో రైతు నాయకుడు శరద్ జోషి నిష్క్రమణతో ఎవరితో కలిసి పనిచేయాలా? అని ప్రశ్న తలెత్తింది. ఇటీవల మహారాష్ట్ర రైతు సంఘం నాయకులను కలిసి పని చేయాలని మాణిక్ రావు కదమ్ ఆహ్వానించారు. రైతు ఉద్యమంలో కలిసి పని చేస్తున్న మిత్రలందరూ మీతో చేతులు కలపాలని, మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారు. మీ విలువైన సమయంలో కొంత కేటాయించాలని కోరుకుంటున్నాం’ అని లేఖలో రైతు సంఘం నాయకులు తెలిపారు.
ఈ లేఖతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి జోష్ వచ్చింది. మరాఠా గడ్డపై పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ కార్యాచరణ మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే షెట్కారీ సంఘటన్ కలిసి పని చేయడానికి ముందుకు రావడం కేసీఆర్ కు మరింత బలం ఇవ్వనుంది. మరి వీరి లేఖకు కేసీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వీళ్లు కలిసి వస్తామని చెప్పడంతో కేసీఆర్ వారిని స్వాగతించే అవకాశం ఉంది. త్వరలోనే ప్రగతి భవన్ కు షెట్కారీ సంఘటన్ ప్రతినిధులు రానున్నారు.