Earthquake In Hingoli : మహారాష్ట్రలో భూమి కంపించింది. అక్కడ హింగోలీలో బుధవారం ఉదయం 7:14 గంటలకు భూకంపం(Earthquake) సంభవించింది. దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 4.5గా నమోదయ్యింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) నేడు వెల్లడించింది.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని ఎన్సీఎస్(NCS) అధికారులు గుర్తించారు. ఈ భూకంప తీవ్రత స్వల్పమైనదే అని తెలిపారు. అందువల్లనే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదని చెప్పారు. పరిస్థితులను దగ్గరుండి పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ప్రజలు మాత్రం భూమి అదరడంతో భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
హింగోలీ, నాందేడ్, ఛత్రపతి సంబాజీ నగర్ తదితర చోట్ల ఈ భూకంప కదలికలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. మరాఠీవాడలోని అన్ని ప్రాంతాల్లోనూ అలాగే విదర్భలోని కొన్ని చోట్ల సైతం భూమి కంపించినట్లు తెలిపారు. మార్చిలో సైతం హింగోలీలో(Hingoli) రిక్టరు స్కేలుపై 4.5, 3.6 తీవ్రతలతో రెండు సార్లు భూమి కంపించింది. మళ్లీ మూడు నెలల తర్వాత ఇప్పుడు అక్కడ భూకంపం వచ్చింది.