»What The Kcr Plan On Karnataka Assembly Elections Brs Will Be Contest
Karnataka Electionsలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా? కేసీఆర్ వ్యూహమేంటి?
రెండు, మూడు సభల్లో కేసీఆర్ కుమారస్వామితో కలిసి ప్రచారం చేస్తారని కర్ణాటకలో ప్రచారం కొనసాగుతున్నది. ఇక తెలంగాణకు సరిహద్దున ఉన్న కన్నడ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయనున్నారు. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (Bharat Rashtra Samithi- BRS Party) తదుపరి వ్యూహం ఏమిటో తెలియడం లేదు. మహారాష్ట్ర స్థానిక సంస్థల (Maharashtra Local Bodies Elections) ఎన్నికల్లో పాల్గొంటామని ఆ పార్టీ ప్రకటించింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections-2023) ప్రకటన విడుదలైంది. కానీ ఈ ఎన్నికల్లో పోటీపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదంటే తన మిత్ర పార్టీ జేడీ (ఎస్) (Janata Dal (Secular) Party) కు మద్దతు ప్రకటిస్తుందా అనేది తెలియడం లేదు. ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో బీఆర్ఎస్ (BRS Party) నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది. తెలుగు ప్రజలు (Telugu People) అత్యధికంగా ఉండే కర్ణాటకలో బీఆర్ఎస్ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ (K Chandrashekar Rao) ఎలాంటి ప్రకటన చేస్తారోనని కన్నడ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు బుధవారం ఎన్నికల సంఘం (Election Commission Of India) ప్రకటన విడుదల చేసింది. దీంతో కర్ణాటకలో రాజకీయ యుద్ధం మొదలైంది. 40 శాతం కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన బీజేపీని సాగనంపాలని ప్రజలు భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. దానికి ప్రతిగా మాజీ ప్రధాని దేవెగౌడ (HD Deve Gowda), మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) పార్టీ జేడీ (ఎస్) కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. తాజాగా ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో కేసీఆర్ అన్నట్టుగానే పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎక్కడ చేస్తారు అనేది జోరుగా చర్చ సాగుతోంది.
ఈసారి దూరమే
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ (KCR) కర్ణాటకలో పర్యటించలేదు. గతంలో పార్టీ స్థాపనపై దేవెగౌడ, కుమారస్వామితో కలిసి చర్చలు చేశారు. కానీ పార్టీ ఆవిర్భావం తర్వాత కన్నడ గడ్డపై అడుగు పెట్టలేదు. పైగా ప్రస్తుతం కేసీఆర్ దృష్టి కన్నడ సీమపై లేదు. బీఆర్ఎస్ ప్రధాన దృష్టి మహారాష్ట్రపై ఉంది. రెండు నెలల వ్యవధిలో సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో రెండు సభలు నిర్వహించారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు మరాఠా గడ్డపై పని చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకపై ఇప్పటివరకు బీఆర్ఎస్ చర్చించలేదు. పార్టీని ఇంకా కన్నడ గడ్డలో విస్తృతం చేయలేదు. కార్యవర్గాన్ని ప్రకటించలేదు. అసలు ఆ రాష్ట్రంపై ఫోకస్ ఉంచలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండే అవకాశం ఉంది.
జేడీ(ఎస్)కు మద్దతు
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మొదట సంపూర్ణ మద్దతు ప్రకటించిన పార్టీ జేడీ(ఎస్). కేసీఆర్ వెన్నంటే దేవెగౌడ, కుమారస్వామి ఉన్నారు. వీరితో కేసీఆర్ కు మంచి అనుబంధం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం తదితర కార్యక్రమాల్లో కుమారస్వామి పాల్గొన్నారు. ఖమ్మం సభకు మాత్రం గైర్హాజరయ్యారు. మళ్లీ కుమారస్వామిని సీఎంగా చూడాలని కేసీఆర్ అభిలషించారు. దాని కోసం కృషి చేస్తామని గతంలోనే ప్రకటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా జేడీ(ఎస్)కు మద్దతు పలికే అవకాశం ఉంది. తెలుగు ప్రజలు అధికంగా నివసించే బీదర్ (Bidar), రాయిచూర్ (Raichur), యాద్గిర్ (Yadgir), కొప్పల్, కలబుర్గి జిల్లాలో బీఆర్ఎస్ జేడీ(ఎస్)కు మద్దతుగా ప్రచారం చేస్తారని సమాచారం. రెండు, మూడు సభల్లో కేసీఆర్ కుమారస్వామితో కలిసి ప్రచారం చేస్తారని కర్ణాటకలో ప్రచారం కొనసాగుతున్నది. ఇక తెలంగాణకు సరిహద్దున ఉన్న కన్నడ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయనున్నారు. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కర్ణాటక ఎన్నికలపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. ఆ ప్రకటనతోనే కర్నాటకలో పార్టీ కార్యక్రమాలు ఉండనున్నాయి.