»Telangana Yadadri And Vargal Temples Gets Bhog Certificate By Fssai
BHOG నాణ్యతకు చిరునామా తెలంగాణ.. 2 ఆలయాలకు ‘బోగ్’ గుర్తింపు
ఆలయాల్లో ప్రసాదం నాణ్యత, వంట గది వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ రెండు ఆలయాలు ఉన్నాయని గుర్తించి బోగ్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, శైవక్షేత్రాలు, ఇతరాత్ర ప్రముఖ ఆలయాలతో వెలుగొందుతున్న తెలంగాణకు మరో శుభవార్త లభించింది. రాష్ట్రంలోని రెండు ప్రధాన ఆలయాలకు అరుదైన గుర్తింపు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా మన ఆలయాలు ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాయి. మన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy Devasthanam), వర్గల్ విద్యా సరస్వతి ఆలయా (Vidya Saraswathi Saneschara Temple)లకు ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) (Food Safety and Standards Authority of India- FSSAI) బోగ్ గుర్తింపు లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (Ministry of Health and Family Welfare) పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ‘బ్లిస్ ఫుల్ హైజీన్ ఆపరింగ్ టు గాడ్’ బోగ్ సర్టిఫికెట్ BHOG Certificate (Blissful Hygienic Offering to God) మన రెండు ఆలయాలకు లభించింది. దేశంలోని 70కి పైగా ఆలయాలు ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఈ గుర్తింపు పొందిన ఆలయాలు తెలంగాణకు చెందినవే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా (Siddipet District) వర్గల్ (Wargal)లోని విద్యా సరస్వతి ఆలయం బాసర తర్వాత అంతటి గుర్తింపు పొందింది. ఇక యాదాద్రి ఆలయం గురించి చెప్పనవసరం లేదు.
నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత (Prasad), వంట గది (Kitchen) నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచీశుభ్రత (Clean and Neatness) వంటి అంశాలు పరిశీలించి మెరుగ్గా ఉన్న ఆలయాలకు బోగ్ సర్టిఫికెట్ లభిస్తోంది. ఈ క్రమంలోనే వర్గల్, యాదాద్రి ఆలయాలను ప్రత్యేక ఆడిట్ బృందం కొన్ని రోజుల కిందట సందర్శించింది. ఈ రెండు ఆలయాల్లో ప్రసాదం నాణ్యత, వంట గది వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ రెండు ఆలయాలు ఉన్నాయని గుర్తించి బోగ్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మంత్రి హరీశ్ రావు హర్షం
తెలుగు రాష్ట్రాల్లోనే మన రాష్ట్రంలోని రెండు ఆలయాలకు బోగ్ గుర్తింపు దక్కడంపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక నోడల్ అధికారిణిగా అడిషనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో యాదాద్రి, వర్గల్ ఆలయాల్లో ప్రసాదం తయారీపై కేంద్ర బృందానికి అవగాహన కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.