NTR: విజయవాడలో కారు చోరీ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన సమాచారం మేరకు భవానిపురం స్వాతి థియేటర్ రోడ్లో ఓ అపార్ట్మెంట్ వద్ద గురువారం రాత్రి పార్కింగ్ చేసిన నానో కారు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితుడు తెలిపారు. శనివారం ఉదయం వచ్చి పార్కింగ్‌లో చూడగా కారు దొంగిలించినట్లు బాధితులు భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
HYD: మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులని అడ్డుకోలేకున్నారు. తాజాగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
KMR: పాల్వంచ మండలం మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన గుండెల్ని దేవరాజు(39) పని నిమిత్తం కామారెడ్డికి వెళ్లారు. పాల్వంచలోని చామల కుంటలో కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయారు. దీంతో ఊపిరాడక చనిపోయారు. ఆయన భార్య గుండెల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తునట్లు ఎస్ఐ అనిల్ పేర్కొన్నారు.
NZB: ఆర్మూర్ పట్టణ చివరిలో శనివారం 11 గంటల సమయంలో హరిపూర్ హైవే క్రాస్ రోడ్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు చేపూర్ హరిపూర్ గ్రామంలో విధులు నిర్వహించే వ్యక్తి, మరొకరు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్నారని సమాచారం. వైద్యం నిమిత్తం ఆర్మూర్ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
KRL: పత్తికొండ నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు శనివారం ఆస్పరి మండలం కైరుప్పల గ్రామ సమీపంలో స్టీరింగ్ విరిగిపోవడంతో అదుపుతప్పి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గాయాలైన వారిని ఆస్పరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
KMM: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాసాని సీతారాములు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. కూసుమంచి మండలం జీల్లాచెర్వు గ్రామానికి చెందిన సీతారాములు బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. వారి మృతిపట్ల జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
WG: సర్వీసు గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి స్వల్ప గాయాల పాలయ్యాడు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంకు చెందిన మిలిటరీ ఉద్యోగి కారింకి శ్రీనివాస్ తన గన్ను ప్రతి 6 నెలలకోసారి నిడదవోలు సీఐ కార్యాలయంలో తనిఖీ చేయిస్తుంటారు. గురువారం నిడదవోలు పోలీస్ కార్యాలయానికి తన గన్ను చెక్ చేయించడానికి తీసుకువచ్చి గన్ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యింది.
ADB: మావల మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న కార్కు మావల జాతీయ రహదారిపై కుక్క అడ్డు వచ్చింది. దానిని తప్పించబోయే క్రమంలో పక్కనున్న చెట్ల పొదల్లోకి కారు దూసుకు పోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పవన్, ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి సంగం వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ, జొన్నవాడ వైపు నుంచి పాల క్యాన్లతో బుచ్చి వైపు వస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారణ చేపట్టారు.
TPT: వరదయ్యపాలెంలో శుక్రవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఓ కంటైనర్ అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆలయంలో ముగ్గులు వేస్తున్న గీత(40) స్వల్పగాయాలతో బయటపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: చోడవరం పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి మేనల్లుడిని మేనమామ హత్య చేశాడు. స్థానికంగా రెల్లివీధిలో నివాసం ఉన్న మేనల్లుడు ఎస్ ప్రేమ కుమార్ మేనమామ బంగారు దుర్గ చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని విక్రయిస్తూ రోజు మద్యం తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇద్దరి మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. మద్యం మత్తులో మేనల్లుడిని చంపినట్టు తెలిపారు.
గద్వాల్: మల్దకల్ మండలం పావనం పల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెదురు బొంగులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
SKLM: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం రాత్రి జలుమూరు మండలం నారాయణ వలస సంత నుంచి ఆలమండకు అక్రమంగా రవాణా అవుతున్న 14 పశువులతో వెళుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రమంలో పశువులను టెక్కలి లోని భవానీపురం గోశాలకు తరలించామని పేర్కొన్నారు.
కడప: సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి అప్పుల బాధలు భరించలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతు K.నాగేంద్ర(35) తన భార్య వాణి(35), పిల్లలు భార్గవ్ (16), గాయత్రి (14) ముగ్గురికి ఉరివేసి చంపి తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
NRML: నిద్రమత్తులో టోల్ ప్లాజా డివైడర్‌ను లారీ ఢీకొన్న ఘటన శుక్రవారం అర్ధరాత్రి సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద జరిగింది. స్థానికుల వివరాల మేరకు అమరావతి నుండి ఓ లోడుతో వస్తున్న(TN 28 BX 6935)టోల్ ప్లాజా వద్దకు రాగానే డివైడర్‌ను ఢీ కొట్టిందని, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.