HYD: ఉప్పల్ భగాయత్‌లో విషాదం నెలకొంది. పిల్లర్ గుంతలోని నీటిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుల సంఘాల భవన నిర్మాణం కోసం ఈ గుంతలు తీశారు. నిన్న అదృశ్యమైన మణికంఠ, అర్జున్ ఇదే గుంతలో విగతజీవులుగా కనిపించారు. డీఆర్ఎఫ్ బృందాల ద్వారా మృతదేహాలను బయటకు తీశారు. వీరు సుజాత, వెంకటేశ్ దంపతులకు చెందిన పిలల్లుగా అని తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
మార్కాపురం పట్టణంలోని అన్నా క్యాంటీన్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు చేతికి ఉన్న బంగారు గాజులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
SKLM: ఆమదాలవలస మండలం కొర్లకోట, రావికంటిపేట మార్గంలో గత రెండు రోజుల క్రితం వేసిన నూతన విద్యుత్ స్తంభాలు సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు విరిగి నేల పడ్డాయని పలువురు స్థానికులు మంగళవారం తెలిపారు. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి, ఈదురు గాలులకు పాత స్తంభాలు పడిపోగా.. వాటి స్థానంలో రెండు రోజుల క్రితమే కొత్త స్తంభాలు వేశారని తెలిపారు.
BHNG: చిట్యాల పట్టణంలో గుండె పోటుతో దినసరి కూలి మంగళవారం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన పల్లపు కోటేశ్వరరావు ఉపాధి కోసం తన కొడుకుని వెంటబెట్టుకుని చిట్యాలకు వచ్చాడు. గుండె పోటు రావడంతో పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
MBNR: జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో ఆదివారం వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభానికి మరమ్మత్తులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినా సరఫరా జరగడంతో ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై స్థానికులు, మృతుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
శ్రీలంకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. మరో 35 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. బౌద్ధ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ఘోరం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ELR: వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని శనివారం చింతలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాతిమాపురం వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఒక వ్యక్తి తన బైక్ ను వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనిని పట్టుకుని విచారించగా రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 35 కేసులు వరకు నమోదైనట్లు సీఐ తెలిపారు.
KMM: పాల్వంచ మండలానికి చెందిన ఓ యువతి (19) వరంగల్లో డిగ్రీ చదువుతోంది. సెలవులు కావటంతో ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏ పనులు చేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఆమె మన స్తాపానికి గురైంది. శనివారం ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే కుటుంబీకులు పాల్వంచ సీహెచ్‌సీకి తరలించగా వైద్యులు చికిత్స చేశారు.
PLD: రొంపిచర్ల మండలంలోని నల్లగార్లపాడులో వరిగడ్డి వామి దగ్దమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, ఆంజనేయులకు చెందిన ఐదు ఎకరాల వరిగడ్డి విద్యుత్ తీగలు తాకి దగ్ధమైంది. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు. నరసరావుపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
SKLM: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అతని వయసు సుమారు 55 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే 9440627567 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు నమోదు చేశామన్నారు.
NLR: కావలి మండలం రాజువారి చింతలపాలెం శివారులో ఫోన్ దొంగతనం అనుమానంతో టిఫిన్ సెంటర్ యజమాని రమేష్‌పై సూర్య అనే యువకుడు శుక్రవారం కత్తితో దాడి చేసినట్లు కావలి రూరల్ ఎస్సై బాజీబాబు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రమేష్ నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమిస్తున్నానని పశ్చిమ బెంగాల్‌కు చెందిన మైనర్ బాలికపై(16) అత్యాచారానికి ఓ యువకుడు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆ యువకుడు ఓంరాజ్ సైని(20)పై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తిరుపతి రాజు, ఎస్సై నాగేంద్రబాబులు తెలిపారు.
MHBD: జిల్లా గార్ల మండలం పాత పోచారం గ్రామానికి చెందిన పసుపులేటి నరేష్ (26) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించేవాడు. మద్యపానం ఎక్కువైందని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన నరేష్ పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రామయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్కో రియాజ్ పాషా తెలిపారు.
KMR: లింగంపేట మండలం బాలాపూర్‌లో ధరావత్ ఈశ్వర్(56) తాడ్వాయి మండలం కరడ్ పల్లిలో ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం బాన్సువాడ మండలంలోని అంకోల్ తాండాలోని అత్తగారింటికి వెళ్లినట్టు, బుధవారం ఉదయం గుండెపోటు రావడంతో బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందారని భార్య సంగుబాయి తెలిపారు.
కృష్ణా: ఇసుక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడిన ఘటన బందరు మండలం చిట్టిపాలెం వద్ద బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పరిమితికి మించిన బరువుతో ఇసుక రవాణా చేపట్టడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.