విశ్వనగరం దిశగా హైదరాబాద్ వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరుతున్నాయి. డేటా కేంద్రాలకు అడ్డాగా.. దేశంలోనే ఐటీకి ప్రధాన నగరంగా.. లైఫ్ సైన్సైస్, టీకాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువగా వస్తుండగా.. ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్ లో కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. ఇప్పటికే ప్రఖ్యాత సంస్థలన్నీ తమ కార్యాలయాలను హైదరాబాద్ లో నెలకొల్పుతున్నాయి. తాజాగా సెమీ కండక్టర్ల తయారీలో దిగ్గజ సంస్థ మైక్రోచిప్ టెక్నాలజీ హైదరాబాద్ లో అతిపెద్ద ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.175 కోట్లు ఉంటుందని అంచనా.
కార్యాలయ స్థలాల లావాదేవీలో హైదరాబాద్ సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. అమెరికాకు చెందిన మైక్రోచిప్ టెక్నాలజీ సంస్థ హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో ఉన్న ‘వన్ గోల్డెన్ మైల్ టవర్’లో ఏకంగా 1.68 లక్షల చదరపు అడుగుల గ్రేడ్- ఏ ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలం విలువ దాదాపు రూ.175 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లావాదేవీలకు కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సలహాదారుగా వ్యవహరించింది.
మైక్రోచిప్ సంస్థకు హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నైలో కేంద్రాలు ఉన్నాయి. తాజా ఆఫీస్ స్థలం కొనుగోలుతో వచ్చే పదేళ్ల విస్తరణ కోసం సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్ తరలివస్తుండడంతో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ బూస్ట్ లభిస్తోంది.