నిహారిక కొణిదెల, వైవా హర్ష , అక్షయ్, సాయి రోనక్, భావనలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. అక్షయ్ పూల్ల అందించిన కథతో ఆదిత్య మందల ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. బీబీసీ స్టూడియోస్ ఇండియన్ ప్రై.లిమిటెడ్, తమడా మీడియా ప్రై.లి బ్యానర్ల మీద సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడా సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ మే 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఇది యువతకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్ అని దర్శకుడు ఆదిత్య అన్నారు. ఒక్కో పాత్రకు ఒక్కో కారెక్టరైజేషన్ ఉంటుందని తెలిపారు. జీవితంలోని ఒక్కో దశకు ఒక్కో పాత్ర ప్రతీకగా ఉంటుంది. ఈ షోను ఇంతలా తీసేందుకు సహకరించిన తమడా మీడియాకు థాంక్స్. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. టీం అందరూ కష్టపడటం వల్లే ఇంత బాగా వచ్చింది. ఫహద్ వల్లే నేను సెట్లో ఎంతో సరదాగా ఉండగలిగాను. నిహారిక చేసిన పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. అక్షయ్‌ను నేను పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. హర్ష లేకుండా నేను ఏ ప్రాజెక్ట్ చేయలేను. రోనక్ ప్రతీ సీన్లో అద్భుతంగా నటించారు. భావన అయితే ఐశ్వర్యలానే నటించిందని ప్రశంసించారు.
నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నానని నిహారిక(konidela niharika) అన్నారు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. తనను తాను కూడా గాయత్రి పాత్రలో ఊహించుకోలేనని వెల్లడించారు. కానీ దర్శకుడు ఆదిత్యను నమ్మి ఈ పాత్రను ఇచ్చారని తెలిపారు. ఈ పాత్రను చేయగలని నమ్మకం ఇచ్చినందుకు థాంక్స్. అక్షయ్‌కి సినిమాలు అంటే బాగా ఇష్టం. మా ఇద్దరి మధ్యే ఎక్కువ సీన్లు ఉంటాయి. భావనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఏ వయసు వాళ్లైనా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. కానీ యంగ్ జనరేషన్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు థాంక్స్. ఇంకా నటిగా, నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
దర్శకుడే ప్రతీ పాత్రను పోషిస్తాడని ఆదిత్యను చూశాకే అర్థమైందని సాయి రోనక్ అన్నారు. ఓ కిస్ సీన్ లేకుండా ప్రాజెక్ట్ చేయవా? అని అడుగుతుంటారు. కానీ ఇందులో అలాంటి సీన్లు ఏమీ ఉండవు. ఇలాంటి పాత్ర మళ్లీ మళ్లీ వస్తుందో లేదో చెప్పలేం. ఈ టీంతో కలిసి పని చేయడం నాకు ఆనందంగా ఉంది. నాకు నిహారికతో మళ్లీ ఓ ప్రాజెక్ట్ చేయాలని ఉందని పేర్కొన్నారు.