»Ghanpur Station Brs Party Mla Thatikonda Rajaiah Open Challenge To Rivals
Ghanpur Station రండి తాడోపేడో తేల్చుకుందాం.. రాజయ్య కన్నీటితో సవాల్
ఎంతో ఆత్మీయంగా మమతానురాగాలు పంచుతూ మహిళల గౌరవాన్ని పెంచేలా, పురుషులతో సమానంగా మహిళలను ప్రోత్సహిస్తున్నా. ఇది ఓర్వలేక ప్రతిపక్షాలతో పాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.
లైంగిక ఆరోపణల వివాదం ఇంకా సద్దుమణగలేదు. పార్టీ ఆదేశాలతో సర్పంచ్ ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పినా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah)ను వేధింపుల వార్త వెంటాడుతోంది. ఎక్కడికి వెళ్లినా అదే ప్రస్తావన వస్తోంది. దీంతో స్టేషన్ ఘన్ పూర్ (Ghanpur Station) నియోజకవర్గంలో ఆయన పర్యటించలేని పరిస్థితి. తాజాగా నియోజకవర్గంలోని కరుణాపురంలో పర్యటించగా రాజయ్య వేధింపుల విషయాన్ని ప్రస్తావించి కన్నీరు పెట్టారు. తన బాధ చెప్పుకుంటూ బోరున ఏడ్చారు. కొందరు నీచ రాజకీయాలు (Cheap Politics) చేస్తున్నారని.. ఆ కోణంలోనే లైంగిక వేధింపు ఆరోపణలు అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయంగా ఎదుర్కోలేక తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. 63 ఏళ్ల వయసున్న తనపై ఇలాంటి ఆరోపణలు (Allegations) చేయడం ఏమిటి? నాపై కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారు. దమ్ముంటే ఎదురుగా నిలబడి రాజకీయాలు చేయాలని.. తాడోపేడో తేల్చుకుందాం’ అంటూ సవాల్ (Challenge) విసిరారు. ‘ఏ సర్వే చూసినా నేను ముందు వరుసలో ఉన్నానని, నన్ను నిజాయతీగా ఎదుర్కోలేక కొందరు శవ రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా.. ఆరోపణలు చేసినా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయం’ అంటూ రాజయ్య ధీమా వ్యక్తం చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందిస్తూ.. ‘ఎంతో ఆత్మీయంగా మమతానురాగాలు పంచుతూ మహిళల గౌరవాన్ని పెంచేలా, పురుషులతో సమానంగా మహిళలను ప్రోత్సహిస్తున్నా. ఇది ఓర్వలేక ప్రతిపక్షాలతో పాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. నా ఆత్మస్థైర్యం కొల్లగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎవరు ఏం చేసినా భయపడేది లేదు. ఊపిరి ఉన్నంత వరకు ఘన్ పూర్ నియోజకవర్గమే నా దేవాలయం.. ప్రజలే నాకు దేవుళ్లు’ అంటూ రాజయ్య ప్రకటించారు.