»Devotees Throng Shiva Temples On The Occasion Of Mahashivratri 2023
Maha Shivaratri 2023: హర హర శంకరా.. పోటెత్తిన భక్తులు
దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలలో ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాశీ విశ్వనాథ్, సోమ్ నాథ్, కాళేశ్వరం, వేములవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలు భక్తులు చేశారు.
మహా శివరాత్రి (Maha Shivaratri) పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో భక్తులు (Devotees) చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే శైవాలయాలు (Shiva Temples) భక్తులతో కిటకిటలాడాయి. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పొద్దుపొద్దునే ఆలయాలకు చేరుకున్నారు. అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. హర హర మహదేవ శంభోశంకర, శివోహం అంటూ భక్తులు తన్మయత్వంలో మునిగారు. దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలలో ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాశీ విశ్వనాథ్ (Kasi Vishwanath), సోమ్ నాథ్ (Somnath), కాళేశ్వరం (Kaleshwaram), వేములవాడ (Vemulawada), శ్రీశైలం (Srisailam), శ్రీకాళహస్తి (Srikalahasti) తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలు భక్తులు చేశారు.
తెలంగాణలో..
మహా శివరాత్రి పురస్కరించుకుని తెలంగాణ (Telangana)లోని శివాలయాలు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేములవాడ, కాళేశ్వరం, రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, ఐనవోలు, జోగులాంబ, కీసర తదితర శైవ క్షేత్రాలు భక్తులు కిక్కిరిసిపోయాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ప్రార్థనల అనంతరం ఉపవాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా శివ నామస్మరణలో మునిగారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా అన్నీ క్యూలైన్లు నిండుకున్నాయి. దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతున్నది. వీఐపీల తాకిడి అధికంగా ఉండడంతో సాధారణ భక్తుల దర్శనాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కోడె మొక్కులు చెల్లించారు. కాళేశ్వరంలో కూడా ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. జోగులాంబ అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేక పూజలు కొనసాగాయి.
ఆంధ్రప్రదేశ్ లో
ప్రముఖ జ్యోతిర్లింగ ఆలయం శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నల్లమల అడవులు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మాల ధరించిన శివ స్వాములు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పరమేశ్వరుడికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక అలంకరణలో ఆలయం దేదీప్యమానంగా వెలిగింది. ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టువస్త్రాలు సమర్పించారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతున్నది. వీఐపీలు తరలిరావడంతో సాధారణ భక్తులకు దర్శనం ఆలస్యమవుతోంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పాలక మండలి పటిష్ట చర్యలు చేపట్టింది.
శ్రీకాళహస్తిలో.. ప్రముఖ శైవక్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాళహస్తీశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ద్రాక్షారామంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభిషేకాలు, బిల్వార్చన చేశారు. లింగాష్టకం పఠిస్తూ భక్తిలో మునిగారు. రాజమహేంద్రవరం, రామతీర్థం, నర్సీపట్నం, శ్రీగిరి క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కోటప్పకొండ (Kotappakonda) లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక్కడి ప్రభలకు ప్రత్యేకత ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు.