Revanth Reddy : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలన్నారు. దీనిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.