»Cm Kcr Announced Brs Party Assembly Candidate At Banswada
BRS Party మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
నేను కూడా ముసలోడిని అవుతున్నా. 69 ఏళ్లు వచ్చాయి. నా కన్నా వయసులో పెద్దవాడైనా.. నేను ఉన్నన్ని రోజులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన్ను వదిలిపెట్టేది లేదు. ఆయన మాటే బ్రహ్మాస్త్రం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections)కు ఇంకా ఏడాది కూడా లేకపోవడంతో పార్టీలు తమ రాజకీయాలకు పదును పెట్టాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే ప్రజల్లో చురుగ్గా ఉండగా.. ఒక్క బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మాత్రం ఇంకా ప్రజల్లోకి వెళ్లలేదు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ (K Chandrasekhar Rao), వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KT Rama Rao) అక్కడక్కడ పర్యటిస్తున్నారు. కానీ ఇంకా ఎన్నికలకు శంఖారావం పూరించలేదు. కాకపోతే పరోక్షంగా ఎన్నికలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థులుగా సిట్టింగ్ లకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కానీ స్థానిక పర్యటనల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఇటీవల హుజురాబాద్ (Huzurabad) పర్యటనలో కేటీఆర్ (KTR) మీ అభ్యర్థి ఇతనే అన్నట్టు పరోక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే. హుజురాబాద్ నుంచి పోటీ చేసేది పాడి కౌశిక్ రెడ్డే (Padi Kaushik Reddy)నని.. అతడికి మద్దతుగా ఉండాలని పార్టీ శ్రేణులతో పాటు ప్రజలకు సూచించాడు. కాగా ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కూడా ఇలాంటి ప్రకటనే చేశాడు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం మీరు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ‘ఈ నియోజకవర్గానికి మీ అవసరం ఉంది.. మీరు ఉండాల్సిందే’ అని పట్టుబట్టారు. పార్టీ బాన్సువాడ (Banswada) అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్ రెడ్డే (Pocharam Srinivas Reddy) ఉంటాడని కేసీఆర్ పరోక్షంగా ప్రకటించారు.
కామారెడ్డి జిల్లా (Kamareddy District) బీర్కూరు (తిమ్మాపూర్)లోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు స్పీకర్ (Speaker), స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. భక్తులు అందించిన 2 కిలోల స్వర్ణ కిరీటాన్ని ఈ సందర్భంగా సీఎం అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి కల్యాణం తిలకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో బాన్సువాడకు వరాల వర్షం కురిపించారు. ఆలయానికి రూ.7 కోట్లు, నియోజకవర్గానికి ఏకంగా రూ.50 కోట్లు ప్రకటించారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు.
‘సింగూరు (Singur) నీళ్ల కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాల్లో భాగమవుతున్నారు. నేను కూడా ముసలోడిని అవుతున్నా. 69 ఏళ్లు వచ్చాయి. నా కన్నా వయసులో పెద్దవాడైనా.. నేను ఉన్నన్ని రోజులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన్ను వదిలిపెట్టేది లేదు. ఆయన మాటే బ్రహ్మాస్త్రం. శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా.. సీఎం అయినా మాట్లాడతారు. ఏ పని అయినా అవుతది. శీనన్న సేవలు బాన్సువాడకు అవసరం.’ అని పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎందుకు తలకెత్తుకున్నానో ఈ సభ ద్వారా చెప్పారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు భగవంతుడితో పాటు ప్రజలందరి దయ ఉండాలని సీఎం కేసీఆర్ కోరారు.